యుద్ధ భయం దాటి లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ట్రంప్ డెడ్ లైన్ దగ్గరపడుతున్న వేళ ఏం జరుగుతోంది..?

యుద్ధ భయం దాటి లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ట్రంప్ డెడ్ లైన్ దగ్గరపడుతున్న వేళ ఏం జరుగుతోంది..?

ఒకపక్క శాంతి చర్చలు కొనసాగిస్తూనే.. మరోపక్క 10 రోజుల డెడ్ లైన్ ముగింపు గురించి ట్రంప్ ఇరాన్ దేశాన్ని హెచ్చరిస్తున్నారు. ఇంకొక్క రోజు ఆగితే బాంబులతో ఇరాన్ లోని కీలక ఇన్ ఫ్రా పై విరుచుకుపడతామని లాస్ట్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర కూడా 100 డాలర్లు దాటేసి వేడెక్కిపోతోంది. ఈ క్రమంలో ఇవాళ నష్టాలతో ట్రేడింగ్ మెుదలుపెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు కొనుగోళ్ల కోలాహలంతో భారీ లాభాల్లో పుంజుకున్నాయి. 

సాయంత్రం మార్కెట్లు ముగిసే నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 787 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 255 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1060 పాయింట్లు పెరగగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 815 పాయింట్లు లాభంతో క్లోజ్ అయ్యింది. ఇవాళ ఐటీ స్టాక్స్ కూడా భారీగానే పుంజుకుని మార్కెట్లను లాభాల్లో నడిపించటంలో దోహదపడ్డాయి.

నేడు ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మార్కెట్లను ఊహించని రీతిలో పుంజుకునేలా చేసాయి. మరోపక్క అమెరికా 45 రోజుల పాటు కాల్పుల విరమణ కోసం అలాగే హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలపై కూడా మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ప్రధానంగా అమెరికా వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు చూస్తుంటే.. ఇరాన్ మాత్రం తమకు స్పష్టమైన హామీలు, తాత్కాలికంగా కాకుండా పూర్తి స్థాయి పరిష్కారం దిశగా డిమాండ్ చేయటం శాంతికి బాటలు పడుతున్నాయనే నమ్మకం పెంచుతోంది గ్లోబల్ మార్కెట్లలో కూడా.