రోగంతో ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ నయం చేస్తాడు.. కానీ రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం ఏకంగా పైకప్పు స్లాబ్ ఊడి మీద పడి మహిళ తల పగిలింది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమాచారం ప్రకారం.. అసలు ఏం జరిగిందంటే... రాజస్థాన్‌లోని చూరు (Churu) జిల్లా సుజన్‌గఢ్‌లో ఉన్న ప్రభుత్వ మాతా శిశు ఆస్పత్రికి కిరణ్ మేఘ్వాల్ (25) అనే మహిళ వైద్యం కోసం వెళ్ళింది. బుధవారం మధ్యాహ్నం ఆమె ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా.. ఒక్కసారిగా వరండా పైకప్పు స్లాబ్ ఊడి ఆమె మీద పడింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయమైంది, దింతో అదే ఆస్పత్రిలోనే ఆమెకు రెండు కుట్లు వేయాల్సి వచ్చింది.
ఇంత జరుగుతున్నా అధికారుల స్పందన మాత్రం నిర్లక్ష్యంగా ఉంది. ఆస్పత్రికి మరమ్మతులు చేయాలని ఆగస్టు 4నే ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖకు (PWD) లేఖ రాశామని, ఇప్పుడు మరోసారి లెటర్ రాస్తున్నామని ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ పురుషోత్తం కర్వా పేర్కొనడం గమనార్హం.
ప్రభుత్వంపై విమర్శల వర్షం
ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజలు నయంచేయించుకోవడానికి ఆస్పత్రులకు వెళ్తే, రాజస్థాన్‌లో ఆసుపత్రులే ప్రాణాంతకంగా మారుతున్నాయి అని ' Xలో ధ్వజమెత్తింది.
ప్రభుత్వానికి ప్రాణ విలువ లేదా ?
"బీజేపీ ప్రభుత్వ హయాంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. మౌలిక సదుపాయాలన్నీ కుప్పకూలుతున్నాయి. ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల మీద కనీస గౌరవం లేదు. కేవలం కమీషన్లు కక్కుర్తి పడటంపైనే వీరికి శ్రద్ధ ఉంది" అని కాంగ్రెస్ దుయ్యబట్టింది.
స్కూళ్లు, ఆస్పత్రులు సహా అన్నీ అస్తవ్యస్తమే
రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాస్రా స్పందిస్తూ.. "ఎక్కడ చూసినా శిథిలావస్థకు చేరిన భవనాలే కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ స్కూల్ పైకప్పు కూలుతుందో, ఏ ఆసుపత్రి స్లాబ్ రోగుల మీద పడుతుందో తెలియని భయానక వాతావరణం నెలకొంది. ఇది కేవలం ప్రమాదం కాదు.. ప్రభుత్వ ఉదాసీనతకు, అవినీతికి నిదర్శనం" అని తీవ్రంగా విమర్శించారు.
మొత్తానికి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రులే సామాన్యులకు మృత్యుహరాలుగా మారుతుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
