IPL Tickets: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2026 సీజన్ వివాదాల మధ్య కొనసాగుతుంది. ఈ మెగా క్యాష్ రిచ్ లీగ్ పై గత కొంత కాలంగా ఏదో ఒక వివాదం చెలరేగుతునే ఉంది. అయితే వరుసగా రెండు విజయాలతో ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఎమ్మెల్యేలు ఐపీఎల్ టికెట్లని దుర్వినియోగం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అటు మైదానంలో ఆటగాళ్లు, ఇటు రాజకీయాల్లో టిక్కెట్ల రగడతో ఐపీఎల్ 2026 కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది.
ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను కర్ణాటక ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలను కర్ణాటక హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర తీవ్రంగా ఖండించారు. టికెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ అవుతాయని, వాటిని కొనుగోలు చేసిన వారే మ్యాచ్‌ను చూస్తారని స్పష్టం చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో జరిగే మ్యాచ్‌లకు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్నాయి, ఎవరు బుక్ చేసుకుంటే వారే వెళ్తున్నారు.. ఇందులో దుర్వినియోగం ఎక్కడుంది? అని ప్రశ్నించారు.
ఇక ఎమ్మెల్యేలు లేదా వారి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారు... ఒకవేళ టికెట్‌పై 'నాన్-ట్రాన్స్‌ఫరబుల్' (వేరొకరికి బదిలీ చేయకూడదు) అని ఉంటే, ఇతరులు ఉపయోగించడానికి వీలుండదు.. కానీ అటువంటి నిబంధన లేనప్పుడు మ్యాచ్ చూసేందుకు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు వెళ్లడంలో తప్పు లేదని కర్ణాటక హోంశాఖ మంత్రి జీ. పరమేశ్వర చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎమ్మెల్యేలు, ఎంపీలకు మూడు టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశప్పనవర్.. ఎమ్మెల్యేలు 'వీఐపీలు', వారు క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఒక్కొక్కరికి కనీసం ఐదు టిక్కెట్లు ఇవ్వాలని కోరడం గమనార్హం.
మరోవైపు, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుత సీజన్‌లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఆదివారం (2026, ఏప్రిల్ 5న) నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
