హైదరాబాద్ లో ‘డబుల్ ’ కాలనీల్లో షాపుల వేలం

 హైదరాబాద్ లో  ‘డబుల్ ’ కాలనీల్లో షాపుల వేలం
  • హైదరాబాద్‌లో కమర్షియల్ షాపుల కేటాయింపు
  • 15, 16 తేదీల్లో ఓపెన్ ఆక్షన్.. కలెక్టర్ నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీల్లో వ్యాపారం చేయాలనుకునే వారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. జిల్లా పరిధిలోని వివిధ 2 బీహెచ్‌కే కాలనీల్లో ఖాళీగా ఉన్న కమర్షియల్ షాపులను బహిరంగ వేలం (ఓపెన్ ఆక్షన్) ద్వారా కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 15, 16 తేదీల్లో సంబంధిత ఆర్డీవో కార్యాలయాల్లో వేలం నిర్వహించనున్నారు. ‘ఎక్కడున్నవి అక్కడ ఉన్నట్లుగా’ ప్రాతిపదికన ఈ షాపులను లీజుకు ఇవ్వనున్నారు. ఈనెల 15న హైదరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో బండ్లగూడ (7 షాపులు), జంగమ్మెట్ (14), ఫరూక్‌నగర్ (8), ధూల్‌పేట్, కుల్సుంపురా, గోషామహల్ ప్రాంతాల్లోని 16 షాపులకు వేలం జరుగుతుంది.

ఆయా షాపుల విస్తీర్ణాన్ని బట్టి చదరపు అడుగుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు కనీస ధర (అప్‌సెట్ ప్రైస్) నిర్ణయించారు. అలాగే ఈనెల 16న సికింద్రాబాద్ ఆర్డీవో కార్యాలయంలో కమలానగర్ (15 షాపులు), చిలకలగూడ, సికింద్రాబాద్ ధోబీఘాట్ (11), ఎల్బీనగర్, బాకారం పరిధిలోని 6 షాపులకు వేలం నిర్వహించనున్నారు. కమలానగర్ ప్రాంతంలో గరిష్ట అప్‌సెట్ ప్రైస్‌ను రూ.20 వేలుగా నిర్ణయించారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.30,000 ధరావత్తు (ఈఎండీ) చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని డీడీ రూపంలో “డిస్ట్రిక్ట్ కలెక్టర్, హైదరాబాద్” పేరుతో తీయాల్సి ఉంటుంది. వేలం జరిగే రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల మధ్య అధికారులకు డీడీలను సమర్పించాలి.