- ట్రంప్‌కు అనుకూలంగా అమెరికా సుప్రీంకోర్టు తీర్పు
అమెరికా- మెక్సికో బోర్డర్ వాల్ నిర్మాణానికి డిఫెన్స్ నిధులును వాడుకోవచ్చని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. బోర్డర్ నిర్మాణానికి గతంలో పెంటగాన్ నుంచి 250 కోట్ల డాలర్లను (సుమారు 17,215 కోట్లు) ట్రంప్ కేటాయించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన డెమోక్రాట్లు వివిధ కోర్టుల్లో కేసులు వేశారు. డిఫెన్స్ నిధులను గోడ నిర్మాణానికి వాడడంపై కింది కోర్టుల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పులొచ్చాయి. తాజాగా దీనిపై నలుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ట్రంప్‌కు అనుకూలంగా తీర్పిచ్చింది. 2016 ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఇచ్చిన హామీల్లో సరిహద్దు గోడ కీలకమైంది. దీన్ని మొదటి నుంచి డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పెంటగాన్ నిధులను కాలిపోర్నియా, ఆరిజోనా, న్యూ మెక్సికోల్లో గోడ నిర్మాణానికి వాడనున్నారు. తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ ట్విట్టర్‌లో స్పందించారు. ‘గోడ నిర్మాణానికి సంబంధించి ఇదో గొప్ప విజయం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కింది కోర్టుల తీర్పులను కొట్టేసినట్టైంది. అనుకున్న లక్ష్యం నెరవేరేందుకు మార్గం క్లియరైంది. బార్డర్ సెక్యూరిటీని ఈ తీర్పు పటిష్ట పరిచింది’ అని పేర్కొన్నారు.
