సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ బహిరంగ లేఖ

రాష్ట్రంలోని చిన్న గ్రామ పంచాయతీల పరిస్థితి దారుణంగా ఉందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఐదో విడత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కారు.. గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి పనుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. పల్లె ప్రగతి పనులకు సంబంధించి ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా బిల్లులు కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు. చిన్న గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి పనుల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మండల పరిషత్ కార్యాలయాల్లో పనిచేసే బోర్ మెకానిక్ లు, కంప్యూటర్ ఆపరేటర్లకు సంబంధించిన జీతాలను చెల్లించే భారం గ్రామపంచాయతీలపై పడకుండా చూడాలని ఆయన కోరారు.

కొందరు సర్పంచ్ ల ఆత్మహత్యలు..

గ్రామ పంచాయతీలకు నిధుల  కొరత వల్ల సర్పంచ్ లు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతున్నారని.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన దాఖలాలు కూడా ఉన్నాయని ఉత్తమ్ గుర్తుచేశారు. ఎస్టీవో కార్యాలయంలో ఫ్రీజింగ్ ఉండటం వల్ల పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనుల బిల్లులు 3 నుంచి 6 నెలల వరకు పెండింగ్ లో ఉంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం గ్రామపంచాయతీలు విద్యుత్ బిల్లులు , ట్రాక్టర్ ఈఎంఐలు చెల్లించే  పరిస్థితి కూడా లేదన్నారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని గ్రామ పంచాయతీలలో ఐదో విడత పల్లె ప్రగతి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సీఎంకు ఉత్తమ్ ఈ లేఖను రాశారు. 

మరిన్ని వార్తలు..

తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్ని మభ్యపెడుతుండు

సొంతగడ్డపై గుజరాత్ గెలిచేనా..?