క్యాండిల్స్ ఫ్యాక్ట‌రీలో పేలుడు.. ఏడుగురి మృతి

క్యాండిల్స్ ఫ్యాక్ట‌రీలో పేలుడు.. ఏడుగురి మృతి

త్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్ జిల్లాలోని ఓ ఫ్యాక్ట‌రీలో ఆదివారం మ‌ధ్యాహ్నం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా భారీ పేలుడు జ‌ర‌గ‌డంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘ‌జియాబాద్ జిల్లాలోని బ‌ఖ‌ర్వా గ్రామంలోని మోడీ న‌గ‌ర్‌లో ఉన్న క్యాండిల్ ఫ్యాక్ట‌రీలో ఈ ఘోరం జ‌రిగింది. అక‌స్మాత్తుగా మంట‌లు అంటుకుని ఆ ఫ్యాక్ట‌రీలో ఒక్క‌సారిగా భారీ శ‌బ్ధంతో పేలుడు సంభ‌వించింద‌ని స్థానికులు చెబుతున్నారు. వెంట‌నే సోలీసుల‌కు, ఫైర్ సిబ్బందికి స‌మాచారం ఇవ్వ‌గా.. హుటాహుటీన వారు అక్క‌డికి చేరుకున్నారు. మంట‌లు ఆర్పి.. స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆ పేలుడు ధాటికి లోప‌ల ఉన్న వారిలో ఏడుగురు మ‌ర‌ణించ‌గా.. న‌లుగురు గాయాల‌పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు. అయితే పేలుడు జ‌ర‌గ‌డానికి కార‌ణం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై ఎంక్వైరీ చేసేందుకు మెజిస్టీరియ‌ల్ ద‌ర్యాప్తుకు ఆదేశించింది ప్ర‌భుత్వం.

ఈ ఘ‌ట‌నపై యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. బాధితుల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని చెప్పారు. జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీలు స్టాప్‌కి చేరుకుని స‌హాయ చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షించాల‌ని, త‌గిన సాయం చేయాల‌ని ఆదేశించారు. పేలుడు ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున రూ.4 ల‌క్ష‌ల చొప్పున‌ ప‌రిహారం అందించ‌నున్న‌ట్లు తెలిపారు క‌లెక్ట‌ర్ అజ‌య్ శంక‌ర్ పాండే. గాయ‌ప‌డిన వారికి ఉచితంగా వైద్యం అందించ‌డంతో పాటు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం చేయ‌నున్న‌ట్లు చెప్పారు.