భూములను ఆన్​లైన్​లో చూపిస్తలేరని పెట్రోల్ పోసుకుండు

భూములను ఆన్​లైన్​లో చూపిస్తలేరని పెట్రోల్ పోసుకుండు

 

  •     కలెక్టరేట్​ ఎదుట వరికోల్ ​రైతుల ధర్నా
  •     పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన రైతు

భూపాలపల్లి అర్బన్, వెలుగు: తమ భూములను ఆన్​లైన్​లో చూపించడం లేదని, తమ భూములు తమకే ఇవ్వాలని డిమాండ్​చేస్తూ జయశంకర్​భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వరికోల్ గ్రామ రైతులు కలెక్టరేట్ ఎదుట గురువారం ఆందోళన నిర్వహించారు. పరకాల–-కాళేశ్వరం 353 జాతీయ రహదారిపై ధర్నా చేశారు. తమ భూములు తమకు ఇవ్వకుండా ఆఫీసర్లు అన్యాయం చేస్తున్నారని, న్యాయం చేయకపోతే చావే దిక్కు అంటూ జంగ సమ్మయ్య అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. తోటి రైతులు, పోలీసులు వెంటనే రైతును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నైన్ పాక గ్రామ శివారులోని సర్వే నంబర్లు 440, 441, 442, 443లో తమకు భూములు ఉన్నాయని 70 ఏండ్లుగా 1600 ఎకరాలలో 350 కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయని చెప్పారు. ఈ భూములను ప్రభుత్వం బ్లాక్​లిస్టులో పెట్టిందని, దాంతో బ్యాంకు రుణాలు, రైతుబంధు పథకం అందడం లేదని అన్నారు. వారసత్వంగా వచ్చిన భూములకు గతంలో అధికారులు పట్టాలు జారీ చేశారని, దీంతో రైతుబంధు డబ్బులు సైతం తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు తమ భూముల రికార్డులు ఆన్​లైన్​లో కనిపించక అన్ని విధాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులను కలిసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ ఆఫీసర్లు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు.