ట్రాఫిక్ రూల్స్.. 5 పాయింట్లకు మించితే వాహనం సీజ్‌

ట్రాఫిక్ రూల్స్.. 5 పాయింట్లకు మించితే వాహనం సీజ్‌

హైదరాబాద్‌, వెలుగు:  ట్రాఫిక్​ చలాన్ల డిస్కౌంట్‌ ఆఫర్‌‌లో ఫైన్లు క్లియర్ చేసుకున్నారా? మళ్లీ రూల్స్‌ బ్రేక్ చేస్తూ వెళ్తున్నారా ? అలా అయితే వాహనాల పాయింట్లలో పోలీసుల చెకింగ్ ల్లో దొరికిపోతారు. పెండింగ్ చలాన్ల లెక్కలు తీసి వాహనం సీజ్‌ చేస్తారు. చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేసి కోర్టుకు అందజేస్తారు. ఇందుకు ట్రాఫిక్ పాయింట్ల సిస్టమ్‌ పక్కాగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. పెండింగ్ చలాన్లతో చిక్కిన వాహనదారులను వయొలేషన్‌ పాయింట్లు చెక్‌ చేస్తున్నారు. 5 పాయింట్లకు మించితే వారి వాహనం సీజ్‌ చేసి కౌన్సెలింగ్‌ కు పంపుతారు. అక్కడికి హాజరైన తర్వాత రిలీజ్ చేస్తారు. 12 కంటే ఎక్కువ పాయింట్లు ఉన్న వాహనదారుల లైసెన్స్​ను సస్పెండ్‌ చేస్తారు. 

ఆర్టీఏ, ట్రాఫిక్ డేటా బేస్ ఆధారంగా..


ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ డేటా బేస్‌ ఆధారంగా పాయింట్ల సిస్టమ్‌ అమలు చేస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలు ఫుటేజ్‌లతో వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్​ను ఆర్టీఏ డేటా బేస్‌కు కనెక్ట్‌ చేశారు. వాహనాలపై నమోదయ్యే ట్రాఫిక్ కేసుల ఆధారంగా పాయింట్లు జనరేట్‌ అవుతాయి.  20 రకాల ఉల్లంఘనలకు సంబంధించి తీవ్రతను బట్టి 1 నుంచి 5 పాయింట్లు ఉంటాయి. హెల్మెట్‌, సిగ్నల్‌ జంప్​సహా ప్రమాదాల్లో మృతికి కారణమైన వాహనాలు,  ఇన్య్సూరెన్స్‌ వరకు పాయింట్లు విధిస్తున్నారు. 24 నెలల కాలంలో పాయింట్ల సంఖ్య 12కు చేరితే ఏడాది పాటు లైసెన్సు రద్దు చేస్తారు. 

ప్రత్యేక తనిఖీలు చేస్తున్నాం

పెండింగ్ ​చలాన్ల డిస్కాంట్ ఆఫర్​కు 70 శాతం మంది వాహనదారులు మాత్రమే స్పందించారు. రిపీటెడ్‌గా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవారిపై ఫోకస్​ చేశాం.  ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పేరెంట్స్ సమక్షంలో కౌన్సెలింగ్ ​ఇస్తున్నాం. హాజరైన వాహనదారులకు 3 పాయింట్లు తగ్గిస్తు న్నాం. కరోనాతో రెండేండ్లుగా పాయింట్ల సిస్టమ్‌ అమలు చేయలేదు. ఆర్టీఏ డేటా బేస్‌లో వాహనాలకు సంబంధించిన ప్రతి వయొలేషన్‌ రికార్డ్ అవుతుంది. వాహనాల నంబర్ ఎంటర్‌ చేయగానే పాయింట్ల ప్రకారం వయొలేషన్స్ డేట్ ​వస్తుంది. ఎక్కువ ఉన్న వారిపై కేసులు ఫైల్‌ చేస్తాం.
- ఏవీ రంగనాథ్‌, ట్రాఫిక్ చీఫ్‌, హైదరాబాద్‌