మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమను దోచుకుంటున్రు

మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమను దోచుకుంటున్రు
  • రాష్ట్ర సర్కార్  వెంటనే స్పందించి న్యాయం చేయాలి
  • ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షురాలు  బీవీ విజయలక్ష్మి

ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనం కంటే మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చేది చాలా తక్కువని,  ఎలా బతుకుతారని ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షురాలు బీవీ విజయలక్ష్మి ప్రశ్నించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో గురువారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ వంట బిల్లులు, వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ విద్యార్థులకు భోజనం అందిస్తున్న కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం మాత్రం దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ్ పావని, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్, జంపాల రవీందర్, ఎం నరసింహ, కరుణ కుమారి, కమలారెడ్డి, పూసల రమేష్, సుగుణ, కుంటల రాములు, దండు లక్ష్మణ్, దశరథం పాల్గొన్నారు.