మనసు విరిగింది.. మళ్లీ ఆడతానో లేదో

మనసు విరిగింది.. మళ్లీ ఆడతానో లేదో

న్యూఢిల్లీ: ఓవైపు మానసిక సమస్యలు.. మరోవైపు ఒలింపిక్స్‌‌లో నిరాశాజనక పెర్ఫామెన్స్‌‌... ఈ రెండింటి మధ్యలో ఫెడరేషన్‌‌ నుంచి షోకాజ్‌‌ నోటీసులు.. ఈ నేపథ్యంలో ఇండియా స్టార్‌‌ రెజ్లర్‌‌ వినేశ్‌‌ ఫోగట్‌‌ రీ ఎంట్రీపై పలు అనుమానాలు మొదలయ్యాయి. మోకాలి గాయంతో 2016 రియో ఒలింపిక్స్‌‌లో  తృటిలో పతకాన్ని మిస్‌‌ చేసుకున్న వినేశ్‌‌.. టోక్యో లక్ష్యంగా విపరీతంగా శ్రమించింది. ఈ క్రమంలో 2017లో కంకషన్‌‌ (హెడ్‌‌ ఇంజ్యురీ)కు గురైనా, రెండుసార్లు కొవిడ్‌‌ బారిన పడినా.. తన టార్గెట్‌‌ను మాత్రం వీడలేదు. అయితే ఈసారి ఒలింపిక్స్‌‌లో 53 కేజీ ఫ్రీస్టయిల్‌‌ ఈవెంట్‌‌లో ఫేవరెట్‌‌ హోదాలో బరిలోకి దిగిన వినేశ్‌‌ అనూహ్యంగా ఓటమిపాలైంది. దీంతో రెండోసారి ఒలింపిక్స్‌‌లో నిరాశే ఎదురైంది.  ‘మనం కెరీర్‌‌లో ఎంత వేగంగా పైకి ఎదుగుతామో.. అంతకంటే వేగంగా కిందకు పడిపోతాం. ఇండియాలో ఇది చాలా సహజం. ఒక్క మెడల్ గెలవకపోతే మనం సాధించినదంతా ఫినిష్‌‌ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎప్పుడు రీఎంట్రీ ఇస్తానో నాకే తెలియదు. బహుశా రాకపోవచ్చు కూడా. నా శరీరం గాయపడకపోయినా మనసు మాత్రం విరిగిపోయింది. కంకషన్‌‌ తర్వాత తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా’ అని వినేశ్‌‌ చెప్పింది. మెంటల్‌‌ హెల్త్‌‌ ఇష్యూస్‌‌పై తాను సైకియాట్రిస్ట్‌‌ను కూడా కలిశానని, ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది. ఇక ఫెడరేషన్‌‌ విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌‌పై ఎలాంటి వివరణ ఇవ్వలేదని చెప్పింది.