వార్ అలర్ట్?: ఇరు దేశాల్లో విమాన సర్వీసులు బంద్

వార్ అలర్ట్?: ఇరు దేశాల్లో విమాన సర్వీసులు బంద్

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత్ – పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? వార్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అన్న అనుమానాలు సామాన్యుల్లో కూడా వ్యక్తమవుతున్నాయి. నిన్న భారత వాయుసేన పాక్ భూభాగంలోని జైషే ఉగ్ర క్యాంపులపై బాంబుల వర్షం కురిపించి వచ్చింది. దాదాపు 300 మంది ఉగ్రవాదులను, వారి ఆయుధాల గోడౌన్ ను ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా ఈ రోజు ఉదయం పాక్ యుద్ధ విమానాలు కశ్మీర్ పౌరులను, భారత బలగాలను టార్గెట్ చేస్తూ దాడికి యత్నించింది. దాన్ని మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. దాడికి వచ్చిన పాక్ యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది.

సరిహద్దుల్లో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరు దేశాల గగనతలం క్లియర్ అవుతోంది. భారత్ – పాక్ మీదుగా వెళ్లే అంతర్జాతీయ విమాన సర్వీసులు దాదాపుగా బంద్ అయిపోయాయి. ఆయా విమానయాన సంస్థలు తమ ఫ్లైట్స్ ని రద్దు చేసుకోవడం లేదా, మరో మార్గానికి మళ్లించడం చేస్తున్నాయని సమాచారం అందుతోంది.

విమానాల రాకపోకలు నిలిపివేత

అమృత్ సర్ ఎయిర్ పోర్టు నుంచి వెనుదిరుగుతున్న ప్రయాణికులు

భారత్ లో పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్, ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్, జమ్ము కశ్మీర్ లోని లేహ్, జమ్ము, శ్రీనగర్ సహా పలు విమానాశ్రయాలను మూసేశారు. కొన్ని కారణాల వల్ల అమృత్ సర్ ఎయిర్ స్పేస్ లో ఆపరేషన్స్ నిలిపేసినట్లు ఎయిర్ పోర్టు డైరెక్టర్ ఏపీ ఆచార్య తెలిపారు. తాత్కాలికంగా విమానాల రాకపోకలు ఆపేశామని చెప్పారు.

పాక్ లో అన్ని ఎయిర్ పోర్టులు క్లోజ్

పాకిస్థాన్లో దాదాపు అన్ని విమానాశ్రయాల్లో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపేశారు ఆ దేశ అధికారులు. లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సైల్కోట్, ఇస్లామాబాద్ విమానాశ్రయాలను మూసేసింది.