బిజినెన్​మెన్​ ఇంట్లో వాచ్​మెన్​కొడుకు చోరీ

బిజినెన్​మెన్​ ఇంట్లో వాచ్​మెన్​కొడుకు చోరీ

గచ్చిబౌలి, వెలుగు: మాదాపూర్​లోని ఓ బిజినెన్​మెన్​ ఇంట్లో పనిచేస్తున్న వాచ్​మెన్​కొడుకు అదే ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. మాదాపూర్ జోన్ డీసీపీ శిల్పవల్లి సోమవారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులో కేసు వివరాలను వెల్లడించారు. నారాయణపేట జిల్లాలోని ఎక్లాస్​పూర్​గ్రామానికి చెందిన సాకలి శంకర్ కొడుకు శివకుమార్(19) ఇంటర్ వరకు చదువుకున్నాడు. తండ్రీకొడుకులు ఇద్దరూ మాదాపూర్​కావూరి హిల్స్​ఫేజ్–​2లో ఉండే బిజినెస్​మెన్​బొడుగం వాసుదేవరెడ్డి ఇంట్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. యువకుడి తీరు నచ్చకపోవడంతో ఇంటి యజమాని 20 రోజుల కింద శివకుమార్​ను పనిలో నుంచి తీసేశాడు. కాగా అక్కడ పనిచేసే టైంలోనే శివకుమార్​ఇంటి తాళాలను డ్యూప్లికేట్ చేసి పెట్టుకున్నాడు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 6.30కు వాసుదేవరెడ్డి కుటుంబంతో కలిసి అజీజ్​నగర్​లోని ఫ్రెండ్ ఫాంహౌజ్ వెళ్లగా, వాచ్​మెన్​శంకర్​పని మీద బయటికి వెళ్లాడు. ఇంట్లో రెనోవేషన్​పనులు చేస్తున్న సిబ్బంది, కారు డ్రైవర్ ద్వారా వాసుదేవరెడ్డి ఇంట్లో లేడని తెలుసుకున్న శివకుమార్​కాంపౌండ్​వాల్​దూకి ఇంట్లోకి చొరబడ్డాడు. డ్యూప్లికేట్​కీస్​తో డోర్లు ఓపెన్​చేస్తూ 3, 4 ఫ్లోర్లలోకి వెళ్లాడు.  ఓ బెడ్​రూంలోని కప్​​బోర్డును స్క్రూడ్రైవర్​తో ఓపెన్​చేసి అందులోని గోల్డ్, క్యాష్ సర్దుకుని10 నిమిషాల్లో పరారయ్యాడు. రాత్రి10.30కు తిరిగొచ్చిన వాసుదేవరెడ్డి బెడ్​రూం డోర్​ఓపెన్​చేసి ఉండడం గమనించాడు. లోనికి వెళ్లి చూడగా కప్​​బోర్డు పగలగొట్టి ఉండడం, అందులో దాచిన క్యాష్, యూఎస్​డాలర్లు, బంగారం కనిపించకపోవడంతో వెంటనే మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు ఫైల్​చేసిన పోలీసులు హౌజ్ రెనోవేషన్​పనులు చేస్తున్న కూలీలు, వాచ్​మెన్ ను విచారించారు. అనంతరం సీసీ ఫుటేజీ పరిశీలించగా ఇంట్లోకి చొరబడి చోరీ చేసింది వాచ్​మెన్​కొడుకు శివకుమార్​గా గుర్తించారు. 25వ తేదీ మధ్యాహ్నం షాద్​నగర్ పరిధిలోని చటాన్​పల్లి వద్ద శివకుమార్​ను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.24,63,250 క్యాష్, 14 తులాల గోల్డ్, 8,134 యూఎస్ డాలర్స్, రాయల్​ఎన్​ఫీల్డ్ బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్ 2021లో కావూరి హిల్స్​లోని హాషా హోమ్స్​లో ఓ రాయల్ ఎన్​ఫీల్డ్ కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. దానికి కలర్​మార్చి తిరుగుతున్నట్లు తెలిసింది. సమావేశంలో మాదాపూర్ ఏసీపీ రఘునందన్, ఇన్​స్పెక్టర్​రవీంద్రప్రసాద్, ఎస్సై రాజేందర్, సుఖేందర్​రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.