సైబర్​ సెక్యూరిటీలో మనది 10వ ప్లేస్​

సైబర్​ సెక్యూరిటీలో మనది 10వ ప్లేస్​
  • గతంలో మన ప్లేస్​ 47
  • ఐటీయూ రిపోర్టు

వెలుగు బిజినెస్​ డెస్క్​: గ్లోబల్​ సైబర్​ సెక్యూరిటీ ఇండెక్స్​ 2020 లో మన దేశం 10 వ ప్లేస్​లో నిలిచింది. అంతకు ముందు కంటే 37 ప్లేస్​లు ఇండియా ముందుకొచ్చినట్లు ఇంటర్నేషనల్​ టెలికమ్యూనికేషన్​ యూనియన్​ (ఐటీయూ) రిపోర్టు వెల్లడించింది. గతంలో 47 వ ప్లేస్​లో ఉన్న ఇండియా 2020 జీసీఐ ర్యాంకింగ్స్​లో 10 వ ప్లేస్​కి ఎదిగిందని పేర్కొంది. ఈ ర్యాంకింగ్స్​లో యునైటెడ్​ స్టేట్స్​ ఆఫ్​ అమెరికా (యూఎస్​ఏ) మొదటి ప్లేస్​లో నిలవగా, యూకే, సౌదీ అరేబియాలు రెండో ప్లేస్​లో నిలిచాయి. ఆ తర్వాత ఎస్టోనియా మూడో ప్లేస్​లోను, కొరియా, సింగపూర్​, స్పెయిన్​లు (మూడు దేశాలూ) నాలుగో ప్లేస్​లో నిలిచాయి. రష్యా, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​, మలేషియా దేశాలు అయిదో ప్లేస్​ను పంచుకున్నాయి. లిథుయేనియా ఆరో ప్లేస్, జపాన్​ ఏడో ప్లేస్​, కెనడా ఎనిమిది, ఫ్రాన్స్​ తొమ్మిదో ప్లేస్​లోనూ నిలిచినట్లు ఐటీయూ ఈ రిపోర్టులో తెలిపింది. ఏషియా–పసిఫిక్​ ప్రాంతానికి చూస్తే, 97.49 స్కోర్​తో నాలుగో ర్యాంక్​ను మన దేశం సాధించింది. కొరియా, సింగపూర్​లు మొదటి ప్లేస్​ను పంచుకోగా, మలేషియా రెండో ప్లేస్​లోనూ, జపాన్​ మూడో ప్లేస్​లోనూ నిలిచాయి. ఐటీయూలో మొత్తం 194 దేశాలకు మెంబర్​షిప్​ ఉంది. అయిదు అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఇండెక్స్​ను రూపొందిస్తున్నారు. ఆన్​లైన్​ సర్వేతోపాటు, సపోర్టింగ్​ ఎవిడెన్స్​లను సేకరించడం, ఎక్స్​పర్ట్​లను కూడా ఐటీయూ కన్సల్ట్​ చేస్తుంది. ఆ తర్వాత ఓవరాల్​ జీసీఐ స్కోర్​ను ప్రకటిస్తుంది.  తాజాగా ప్రకటించిన రిపోర్టు ఐటీయూ నాలుగో ఎడిషన్​. 

లింక్డ్​ఇన్​ డేటా లీక్​ ?
70 కోట్ల మంది లింక్డ్​ఇన్​ యూజర్ల డేటా లీకయ్యింది. ఈ డేటాను ఒక హ్యాకర్​ ఆన్​లైన్​లో అమ్మకానికి పెట్టడంతో ఇది బయటకు వచ్చింది. ఈ ప్రొఫెషనల్​ నెట్​వర్కింగ్​ సైట్​కు మొత్తం 75.6 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అంటే, సుమారు 92 శాతం మంది యూజర్ల డేటా బయటకు లీకయినట్లు. లింక్డ్​ఇన్​ యూజర్ల పర్సనల్​ డిటెయిల్స్​, ఫోన్​ నెంబర్లు, అడ్రస్​లు, జియోలొకేషన్​ డేటా, వారికొచ్చే జీతాల వివరాలు వంటివన్నీ లీకయిన డేటాలో ఉన్నట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. హ్యాకర్​ ఫోరమ్​ ఒక దానిలో ఆ హ్యాకర్​ 10 లక్షల మంది యూజర్ల డేటాను శాంపిల్​గా ఉంచినట్లు ప్రైవసీ షార్క్స్​ రిపోర్టు చేసింది. అయితే, తమ మెంబర్ల డేటా లీక్​ కాలేదని మరోవైపు లింక్డ్​ఇన్​ చెబుతోంది.  లింక్డ్​ఇన్​ సహా మరికొన్ని వెబ్​సైట్ల నుంచి తీసుకొచ్చిన డేటాగా కొట్టిపారేసింది. ఏప్రిల్​ 2021లో ఏ డేటా లీక్​ గురించి మాట్లాడామో ఇప్పుడూ అదే డేటా లీకయిందంటున్నారని లింక్డ్​ఇన్​ స్పష్టం చేసింది. తమ మెంబర్లందరికీ తమ కంపెనీపై నమ్మకం ఉందని, స్ర్కేపింగ్​ లాంటి చర్యలు లింక్డ్​ఇన్​ టర్మ్స్​ ఆఫ్ సర్వీస్​ను వయొలేట్​ చేయడమే అవుతుందని తెలిపింది. అలాంటి వారిని వదిలిపెట్టబోమని పేర్కొంది.