V6 News

భగత్​ సింగ్​ ఫాలోవర్​ను.. దాడులకు బెదరను

భగత్​ సింగ్​ ఫాలోవర్​ను.. దాడులకు బెదరను

లిక్కర్ స్కాంలో బాస్ కేజ్రీవాలేనని ఠాకూర్  ఆరోపణ

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ రెండు మూడు రోజుల్లో తనను అరెస్ట్ చేయొచ్చని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, విద్యా శాఖల మంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. తాను భగత్ సింగ్ ఫాలోవర్ ను అని.. సీబీఐ, ఈడీ దాడులకు బెదిరే వ్యక్తిని కానన్నారు. ఎక్సైజ్ పాలసీలో అవినీతి కేసులో సిసోడియాను ఏ1(మొదటి నిందితుడు)గా చేర్చిన సీబీఐ శుక్రవారం ఆయన ఇంటితో పాటు ఏడు రాష్ట్రాల్లోని అనేక చోట్ల దాదాపు 15 గంటల పాటు సోదాలు చేసింది. కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్ టాప్​లు స్వాధీనం చేసుకుంది. దీనిపై శనివారం మీడియాతో సిసోడియా మాట్లాడుతూ.. తానెలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎక్సైజ్ పాలసీ పూర్తిగా పారదర్శకంగా రూపొందించామన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీకి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​కు మధ్యే పోటీ ఉంటుందని మరోసారి చెప్పారు. 

కేజ్రీవాల్ జవాబు చెప్పాలె.. 

లిక్కర్ స్కాం కేసులో సిసోడియా నిందితుడు మాత్రమేనని, అసలు సూత్రధారి సీఎం కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ‘‘ప్రెస్ మీట్​లో వాడిపోయిన సిసోడియా ముఖమే అసలు విషయాన్ని చెప్పింది” అని ఠాకూర్ అన్నారు. కేజ్రీవాల్ ముందుకొచ్చి తన ప్రశ్నలకు జవాబు చెప్పాలన్నారు. 

కాంగ్రెస్ ధర్నా 

లిక్కర్ స్కాం కేసులో ఏ1గా ఉన్న సిసోడియా మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీసు ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. కాగా, ఈ కేసులో సీబీఐ శనివారం కొందరు నిందితులకు సమన్లు జారీ చేసింది. మరోవైపు, ఎల్జీ వినయ్​ కుమార్​ సక్సేనా 12 మంది ఐఏఎస్​లను ట్రాన్స్ ఫర్ చేశారు.