జీవితకాలం పెంచే పరిశోధనల్లో 17 ఏళ్ల స్టూడెంట్

జీవితకాలం పెంచే పరిశోధనల్లో 17 ఏళ్ల స్టూడెంట్

దేశంలోనే చిన్న వయస్కుడైన సైంటిస్ట్ గా అరుదైన రికార్డు సృష్టించాడు లక్ష్య శర్మ. మనిషి ఆయువును పెంచడంపై ఈ కుర్ర సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు. స్కూలు వయసులోనే పరిశోధనల మీద దృష్టి పెట్టిన లక్ష్య శర్మ.. ప్రస్తుతం గుర్గావ్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూలులో 12వ తరగతి చదువుతున్నాడు. ఇంత చిన్న వయసులోనే జీవన ప్రమాణం పెంచే రీసెర్చ్ చేసి ‘‘సెల్యూలార్ సెన్సెన్ అండ్ సెక్రెటోరీ ఫెనోటైప్స్ థ్రూ ద లెన్స్ ఆఫ్ ఏజింగ్’’ అన్న పేరుతో తన స్టడీని పబ్లిష్ చేశాడు.  17 ఏండ్ల ఈ కుర్రాడి ప్రతిభను మెచ్చుకుంటూ డీఆర్డీవో సర్టిఫికెట్ ఆఫ్ హానర్ ను అందించింది.

ఏం ప్రయోగమంటే..

వయసు పెరిగే కొద్దీ మన శరీరంలోని కణాల శక్తి, సామర్థ్యాలు కూడా తగ్గుతూ వస్తాయి. శరీరంలో పట్టుసడలిపోయి.. వృద్దాప్య చాయలు కనిపించడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఇలా జరగడానికి కారణాల్లో ఒకటి.. సెల్యులార్ సెన్సెన్స్ అనే ప్రక్రియ. మనలో వృద్ధాప్య చాయలు కనిపించడానికి కారణం ఇదే. దీని వల్లే వయసుతో పాటు వచ్చే ఎముకలు, కీళ్ల సమస్యలు, చూపు తగ్గడం, కండరాల్లో పటుత్వం తగ్గిపోవడం సహా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే కణాల్లో పటుత్వం కోల్పోకుండా ఆపడం సాధ్యమే. మందులతో దీనిని కంట్రోల్ చేయొచ్చని లక్ష్య శర్మ చెబుతున్నాడు. దీనికి సరైన మందులు కనిపెడితే ఎక్కువ కాలం మనిషి ఆరోగ్యం, వృద్ధాప్య చాయలు కనిపించకుండా బతకొచ్చంటున్నాడు. దీనికి సంబంధించి మందులను డెవలప్ చేసేందుకు ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్లతో కలిసి ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపాడు.

ఆ సమస్యలు లేని వృద్ధాప్యం

శరీరంలో ప్రతి కణం నిరంతరం డివిజన్ జరుగుతూ కొత్త కణాలు పుడుతూనే ఉంటాయి. అయితే ఒక దశలో ఈ ప్రక్రియకు ‘‘ఎమర్జెన్సీ బ్రేక్’’ పడుతుంది. ఇది జరిగినప్పటి నుంచి శరీరంలో కణ విభజన ఆగిపోయి.. కొత్తగా కణాల పుట్టుక నిలిచిపోతుంది. దీనినే సెల్యూలార్ సెన్సెన్ అంటాం. ఈ ఎమర్జెన్సీ బ్రేకులు వేసే సెల్స్ ను సెన్సెన్ట్ సెల్స్ అంటారు. అయితే ఔషధాల సాయంతో ఈ బ్రేక్స్ పడకుండా అడ్డుకునే వీలుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ సెల్స్ లో ఈ మార్పు చేసే ప్రక్రియలో ఏ మాత్రం తేడా జరిగినా కేన్సర్లకు దారి తీసే ప్రమాదం ఉందని ఎలుకలపై చేసిన పరిశోధనల్లో తేలింది. ‘‘ఈ సెల్యూలార్ సెన్సెన్ అనే ప్రక్రియ శరీరంలోని అన్ని కణాల్లో ఒకేసారి జరగాలనేం లేదు. వయసుతో పాటు క్రమంగా జరుగుతూ ఉంటుందిది. 20 ఏండ్ల వయసున్న వ్యక్తిలోనూ సెన్సెన్ట్ సెల్స్ ఉంటాయి. 50 ఏండ్ల వ్యక్తి శరీరంలోనూ ఉంటాయి. అయితే 50 ఏండ్ల వయసున్న వారిలో వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది’’ లక్ష్య తన స్టడీలో పేర్కొన్నాడు. ఈ సెన్సెన్ట్ సెల్స్ ను తొలగిస్తే వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలు, కండరాల, ఎముకల సమస్యలు లాంటివి రావడం 35 శాతం తగ్గించవచ్చని, దీని ద్వారా వయసు పెరిగినా మంచి ఆరోగ్యంతో ఉండొచ్చని లక్ష్య తెలిపాడు. అంటే ఈ సెల్స్ తొలగింపుతో వృద్ధాప్యంలోకి వచ్చినా ఆ వృద్ధాప్య చాయలు, ఆ సమస్యలు లేకుండా బతికేచ్చని తన రీసెర్చ్ పేపర్ లో పేర్కొన్నాడు. దీని ద్వారా మనషి ఆయు: ప్రమాణం పెరుగుతుందని, అయితే దీనికి అవసరమైన మందులను డెవలప్ చేయడంపై వర్క్ చేయాలని, ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేలా ఈ సెనోలిటిక్ మందుల తయారీపై దృష్టి పెట్టాలని లక్ష్య చెబుతున్నాడు.


మందుల తయారీపై రీసెర్చ్ మొదలుపెట్టాం

‘‘వృద్ధాప్య సమస్యలకు చెక్ పెట్టి ఆరోగ్యంగా, దీర్ఘకాలం బతికేలా చేసే సెనోలిటిక్ మందులను డెవలప్ చేస్తే చాలా రకాల స్పెషలిస్ట్ డాక్టర్లతో పని ఉండదు. కొత్త కణాల పుట్టుక నిలిచిపోవడం వల్లే జాయింట్లలో గుజ్జు అరిగిపోయి.. ఆర్థరైటిస్ లాంటి సమస్యలు వస్తాయి. దీనికి చెక్ పెడితే జాయింట్స్ స్పెషలిస్ట్ డాక్టర్లతో పని ఉండదు. అలానే హార్ట్, లంగ్స్, కంటి డాక్టర్ల అవసరం కూడా ఉండదు. వీటన్నింటికీ సెన్సెన్ట్ సెల్స్ ను లేకుండా చేస్తే చాలు. ఇందుకోసం అవసరమైన మందుల అభివృద్ధికి ఐఐటీ ఢిల్లీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. వెట్ ల్యాబ్ ఇంటర్న్ గా చేరి రెండు మూడు నెలలుగా రీసెర్చ్ పనులు మొదలుపెట్టా. ఈ సెనోలిస్టిక్ మందులకు సంబంధించి ఇప్పటికే విదేశాల్లో ఎలుకలపై ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనుషులపై ప్రయోగాలు చేయాల్సి ఉంది. ప్రపంచంలో సెల్యులార్ సెన్సెన్స్ పై ప్రయోగాలు కొద్ది కాలం నుంచే మొదలయ్యాయి. ఈ ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కొద్ది సంవత్సరాలుగా ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ జమ్ము, ఐఐటీ రోపర్, ఐఐఎస్సీ బెంగళూరు సహా కొన్ని ప్రైవేట్ కంపెనీల్లోనూ అకడమిక్ రీసెర్చర్ గా పని చేస్తున్నాను. కేన్సర్ ట్రీట్మెంట్ కు సంబంధించి.. ఐఐటీ బాంబేలోని ప్రొటియోమిక్స్ ల్యాబోరేటరీ పని చేసిన అనుభవంతో ప్రొటీన్ అనాలిసిస్ పై పుస్తకం రాశాను’’ అని లక్ష్య పేర్కొన్నాడు.