దౌడు తీసే అపార్ట్ మెంట్ ..రేటెంతో తెలుసా?

దౌడు తీసే అపార్ట్ మెంట్ ..రేటెంతో తెలుసా?

ఎక్కడికైనా టూర్​ పోవాలి. ఓ మాంచి కారు మాట్లాడుకుంటం. జనాలు ఎక్కువుంటే కొంచెం పెద్ద బండి బుక్​ చేసుకుంటం. మధ్య మధ్యలో ఆకలి రాముడిని చల్లార్చడానికి దాబాల దగ్గర ఆపుతుంటం. కడుపు బిర్రుగైతే హాల్ట్​ చేస్తం. రాత్రి పూట రెస్ట్​ తీసుకోవడానికి ఏదో ఒక హోటల్​ను బుక్​ చేసుకోవాల్సిందే. ఆ తలనొప్పులేవీ లేకుండా అన్నీ ఒక్క బండిలోనే ఉంటే ఎట్లుంటది? ఇదిగో ఈ ట్రక్కు లెక్క ఉంటది. అవును, ఇది ట్రక్కే. కానీ, దౌడు తీసే అపార్ట్​మెంట్​ ఇది. పైన చెప్పిన తిప్పలు తప్పించుకునేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఓ కుటుంబం ఇలా ఆర్డరిచ్చి మరీ వీల్స్​ ఆన్​ అపార్ట్​మెంట్​ను తయారు చేయించుకుంది. ఇద్దరు పెద్దోళ్లు, ఆరుగురు పిల్లలున్న ఆ ఫ్యామిలీ ఆస్ట్రేలియా మొత్తం తిరిగి రావాలనుకుంది. అందుకు మామూలు కార్లు, పెద్ద బండ్లు అయితే ఎన్నెన్నో చిక్కులుంటాయని అనుకుంది. ఆ జంఝాటాలేవీ లేకుండా ఉండేందుకు ఎస్​ఎల్​ఆర్​వీ ఎక్స్​పెడిషన్​ వెహికిల్స్​ అనే కంపెనీ దగ్గరకు పోయింది. తమ ఐడియాను చెప్పింది. ఆ కుటుంబం చెప్పినట్టు వార్విక్​ బోస్వెర్జర్​, అతడి టీం 13 నెలలు కష్టపడింది. సకల సౌకర్యాలతో ట్రక్కునే అపార్ట్​మెంట్​గా తీర్చిదిద్దింది.

వంట చేసుకోవడానికి కిచెన్​, పడుకోవడానికి బెడ్లు, బాత్రూంలు, హాలు, ఎంటర్​టైన్మెంట్​ కోసం టీవీలు.. ఒక్కటేంటి, మనం ఇంట్లో ఏవేవైతే ఏర్పాటు చేసుకుంటామో వాటన్నింటినీ ఈ ట్రక్కులో ఏర్పాటు చేసింది కంపెనీ. స్టోరేజీ కోసం బెడ్ల కిందనే వసతి ఏర్పాటు చేసింది. వాతావరణానికి తగ్గట్టు గది ఉష్ణోగ్రతలను చూసుకునే ఎయిర్​ కండిషనింగ్​ వ్యవస్థనూ పెట్టింది. అవన్నీ నడవాలన్నా, ఫోన్లు, కంప్యూటర్లకు చార్జింగ్​ పెట్టుకోవాలన్నా కరెంట్​ కావాలి కదా. దాని కోసం పెద్ద పెద్ద బ్యాటరీలను ట్రక్కుల్లో పొందుపరిచింది. బ్యాటరీలకు చార్జింగ్​ ఎక్కించేందుకు సోలార్​ పానెళ్లను ట్రక్కు టాప్​లో ఏర్పాటు చేసింది. మరి, ఇన్ని హంగులున్న ట్రక్కులో టూర్​ పోతే కష్టమన్నది తెలుస్తదా? అలసిపోవడమన్న మాట ఉంటదా? అంత హాయిగా టూర్​ పోవాలంటే పైసలు కూడా బాగానే ఖర్చు పెట్టాలి మరి. ఈ వీల్స్​ ఆన్​ అపార్ట్​మెంట్​ రేట్​ ఎంతో తెలుసా? అక్షరాల 14 కోట్ల 21 లక్షల రూపాయలు.