మరియమ్మ డెత్ మిస్టరీ.. అసలు ఏం జరిగింది?

మరియమ్మ డెత్ మిస్టరీ.. అసలు ఏం జరిగింది?

అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ అయిన మరియమ్మ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్సై మహేష్, కానిస్టేబుళ్లు జానయ్య, రషీద్‌లను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. అయితే అసలు మరియమ్మను పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకెళ్లారు? అక్కడ ఏం జరిగింది అనే విషయాలు మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఒక మహిళను స్టేషన్‌కు తీసుకెళ్లి.. రాత్రివేళ కూడా అక్కడే ఉంచకూడదని పోలీసులకు తెలియదా అని ప్రశ్నలు వస్తున్నాయి. 

ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన మరియమ్మ (40).. అడ్డగూడూరు మండలం గోవిందాపురంలోని ఓ చర్చి ఫాదర్ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తోంది. కాగా.. ఈ నెల 3న మరియమ్మను చూసేందుకు ఆమె కొడుకు ఉదయ్ కిరణ్ తన స్నేహితుడు శంకర్‌తో కలిసి చర్చికి వచ్చాడు. ఆ సమయంలో చర్చి ఫాదర్ ఊరులో లేడు. ఆయన ఈ నెల 7న వచ్చిన తర్వాత చూస్తే.. బీరువాలోని సుమారు రూ.2 లక్షలు చోరీ అయ్యాయని గుర్తించాడు. దాంతో మరియమ్మ, ఆమె కొడుకు ఉదయ్ కిరణ్, అతని స్నేహితుడు శంకర్‌‌లు ఈ చోరీకి పాల్పడ్డారని చర్చి ఫాదర్ అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. దాంతో అడ్డగూడూరు పోలీసులు విచారణ నిమిత్తం మరియమ్మను మరియు ఆమె కుమారుడితో పాటు శంకర్‌ను జూన్ 16న అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఉదయ్ కిరణ్, శంకర్‌లు తామే దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారు. అనంతరం వారి నుంచి సుమారు రూ. 1.3లక్షలు రికవరీ చేశారు. కాగా.. మిగతా రూ. 70 వేల కోసం విచారణ కొనసాగించారు. ఈ క్రమంలో అడ్డగూడూరు ఎస్సై మహేష్, కానిస్టేబుళ్లు జానయ్య, రషీద్‌లు తల్లీకొడుకులతో పాటు శంకర్‌ను విచక్షణారహితంగా కొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసుల దెబ్బలు తాళలేక జూన్ 18న స్టేషన్‌లోనే మరియమ్మ తన కొడుకు చేతిలో కన్నుమూసింది.