బీజేపీ గెలిస్తే రాజకీయ వ్యూహకర్తగా తప్పుకుంటా

బీజేపీ గెలిస్తే రాజకీయ వ్యూహకర్తగా తప్పుకుంటా

కోల్‌‌కతా: బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే మళ్లీ పవర్‌‌లోకి వస్తుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. త్వరలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌‌గా తప్పుకుంటానని, వేరే రంగంలోకి వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్‌‌కు చెందిన ఐప్యాక్ సంస్థ ఈ ఎన్నికల్లో తృణమూల్ గెలుపునకు అవసరమైన వ్యూహాలను పన్నుతోంది. ఇప్పటికే ఒకసారి బెంగాల్ ఎన్నికల గురించి మాట్లాడిన ప్రశాంత్ మరోమారు తృణమూల్ పక్కాగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

‘బెంగాల్‌‌లో బీజేపీ 100 సీట్లకు పైగా గెలిస్తే నేను ఈ ఉద్యోగాన్ని మానేస్తా. ఐప్యాక్‌‌ను కూడా వదిలేస్తా. నేను ఇంకో పని చూస్కుంటా కానీ ఈ వర్క్ అయితే చేయను. మరే రాజకీయ ప్రచారంలోనూ నన్ను మీరు చూడబోరు. నేను స్ట్రాటజిస్ట్‌‌గా పని చేసిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మేం ఓడిపోయాం. కానీ అక్కడే మేం ఏం చేయాలనుకున్నామో అది చేయలేకపోయాం. అయితే బెంగాల్‌‌లో అలా కాదు. నాకు పని చేయడానికి ఎంత స్వేచ్ఛ కావాలో అంత ఫ్రీడమ్‌ను దీదీ (మమతా బెనర్జీ) ఇచ్చారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో తృణమూల్ ఓడిపోతే ఈ జాబ్‌కు నేను సరిపోననే అర్థం. బెంగాల్‌‌లో తృణమూల్‌‌ ఓడాలంటే ఆ పార్టీ దానంతట అదే కూలాలి. అది అసాధ్యం’ అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.