బెల్టు షాపులపై దాడులు చేస్తున్న‌ వైన్స్ షాపు యజమానులు

బెల్టు షాపులపై దాడులు చేస్తున్న‌ వైన్స్ షాపు యజమానులు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో వైన్సు షాపు యజమానులు పోలీసులను మించిపోతున్నారు. పోలీసులు అక్రమార్కులపై కొరఢా ఝళిపిస్తుంటే… తమ షాప్‌ల‌లో మద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం లేదని వైన్స్ షాప్‌ల యజమానులు బెల్టుషాపులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తిమ్మాపూర్ మండలం పోరండ్లకు చెందిన సదిరె సంపత్ అనే బాధితుడు దీనిపై మాట్లాడుతూ… బెల్టు షాపు నిర్వహిస్తున్న తాను నుస్తులాపూర్ వైన్సు షాపులో మద్యం కొనుగోలు చేస్తుంటాన‌ని తెలిపాడు. అయితే అక్క‌డి వైన్సు షాపు యజమానులు ఒక్కో క్వార్టర్ కి పది రూపాయల చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారని, అందుకే అప్పుడప్పుడు కరీంనగర్ లో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

అయితే.. తమ వద్ద మ‌ద్యం కోనుగోలు చేయకుండా బెల్టుషాపులు ఎట్లా నిర్వహిస్తారంటూ వైన్స్ నిర్వాహకులు తమ ఇంట్లోకి వచ్చి దాడులు చేసి మద్యం ఎత్తుకెళ్లారని సంపత్ ఆవేదన వ్యక్తం చేశాడు. దాడుల సంగతి ఎవరికైనా చెబితే.. పోలీసులు, ఎక్సైజ్ పోలీసులకు చెప్పి కేసు వేయిస్తామంటూ బెదిరింపులకు గురి చేశారన్నాడు. తన ఇంటిపై దాడి చేసి మ‌ద్యం ఎత్తుకెళ్లిన విషయాన్ని సంపత్ వెంటనే తిమ్మాపూర్ ఎక్సైజ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాడు

ఎక్సైజ్ పోలీసుల జోక్యంతో తీసుకెళ్ళిన మద్యాన్ని తిరిగి సంపత్ కి అప్పగించారు. ఎక్సైజ్ పోలీసుల సహకారంతోనే వైన్సు షాపుల యజమానులు రెచ్చిపోతూ ఏకంగా ఇండ్లపై దాడులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బెల్టు షాపులకు అధిక ధరలకు మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ అధికారులు నోరుమెదపక పోవడం విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా వైన్సు షాపు యజమానులపై అధికారులు చర్యలు తీసుకుని మద్యాన్ని ఎమ్మార్పీ ధరకు విక్రయించేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.