మాస్క్ లేకుండా బయటికొస్తే వెయ్యి ఫైన్

మాస్క్ లేకుండా బయటికొస్తే వెయ్యి ఫైన్
  • రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
  • నేటి నుంచి అమల్లోకి

హైదరాబాద్: మాస్క్ లేకుండా బయటికి వస్తే రూ. వెయ్యి జరిమానా విధించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో లాక్​డౌన్ నిన్నటితో ముగియగా.. ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్లు సీఎస్ జీవో విడుదల చేశారు. లాక్ డౌన్ లో సడలింపులు కల్పిస్తూ అనుమతులిచ్చిన ప్రభుత్వం మాస్కు ధరించడాన్ని కూడా తప్పనిసరి చేసింది. మాస్క్ లేకుండా బయటికి వచ్చిన వారికి వెయ్యి పెనాల్టీ తప్పదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిబంధన తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రమంతటా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించింది. ఆ సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం మాత్రమే బయటికి వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మెడికల్ దుకాణాలు, హాస్పిటల్స్ మినహా అన్ని రకాల షాపులు సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని ఆదేశించింది.