సివిల్స్ రాసే మహిళా అభ్యర్థులకు గుడ్‎న్యూస్

సివిల్స్ రాసే మహిళా అభ్యర్థులకు గుడ్‎న్యూస్

బీహార్ ప్రభుత్వం సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతోన్న మహిళలకు బంపర్ ఆఫరిచ్చింది. కేంద్ర మరియు రాష్ట్ర సివిల్ సర్వీస్‎లకు చెందిన ప్రిలిమ్స్ పరీక్షలను పాసైన జనరల్ కేటగిరీ మహిళా అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. ప్రిలిమ్స్ సాధించిన అభ్యర్థులు ఈ మొత్తంతో మెయిన్ పరీక్షతో పాటు ఇంటర్వ్యూకు సిద్ధమయ్యేందుకు ఉపయోగపడుతుందని బీహార్ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంలోని మహిళా శిశు అభివృద్ధి సంస్థ మహిళా అభ్యర్థులకు ఈ మొత్తాన్ని అందజేస్తుందని ఒక అధికారి తెలిపారు.

‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో బీహార్ మహిళల పనితీరును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 2021లో నిర్వహించిన యూపీఎస్సీ లేదా బీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల్లో విజయం సాధించిన మహిళలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు’ అని డబ్ల్యుసిడిసి మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ బమ్హారా తెలిపారు. అదేవిధంగా గతంలో సివిల్ సర్వీస్ ప్రోత్సాహక పథకాల కింద ఆర్థిక సహాయం పొందని మహిళలకు కూడా ఈ ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ఆమె తెలిపారు.

గతంలో ఈ పథకం కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు మాత్రమే ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలోని మిగిలిన మహిళా అభ్యర్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందని హర్జోత్ కౌర్ తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నామని.. డిసెంబర్ 3 వరకు గడువు ఉందని ఆమె తెలిపారు.