- స్పెషల్ గెస్టులుగా అంగన్ వాడీ వర్కర్లు
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవానికి ఈ సారి అంగన్ వాడీ వర్కర్లు, స్ట్రీట్ వెండర్లు, మార్చురీ వర్కర్లు, ముద్ర స్కీం కింద లోన్ లు తీసుకున్నవారు స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలకు స్వచ్ఛాగ్రహ్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, ఆటో డ్రైవర్లు, కన్ స్ట్రక్షన్ వర్కర్లు, శకటాలను సిద్ధం చేసిన కూలీలను స్పెషల్ గెస్టులుగా ఆహ్వానించారు.
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట త్రివర్ణమయం అయింది. అన్ని చోట్లా జాతీయ జెండాలు, పూలు, పెయింటింగ్స్ తో మువ్వన్నెలు పులుముకుంది. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలోని కీలక ఘట్టాలను ఆవిష్కరించేలా గోడలపై వేసిన పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధాని మోడీ ప్రసంగానికి ముందుగా ఎర్రకోటపై తొలిసారిగా మిగ్ 17 హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. ఎర్రకోట ముఖద్వారం వద్ద రెండు ఏనుగుల రూపంలో ఏర్పాటు చేసిన మెషీన్లు ఆకట్టుకున్నాయి. ఏనుగుల లోపల ఒక్కో వ్యక్తి ఉండి, వాటిని ఆపరేట్ చేశారు. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత జనం పెద్ద ఎత్తున ఆ ఏనుగుల వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు. ప్రధాని స్పీచ్ అయిపోయిన తర్వాత ఎర్రకోట నుంచి భారీ ఎత్తున బెలూన్లు గాలిలోకి వదిలారు. ఎర్రకోట వద్ద గన్ సెల్యూట్ లో తొలిసారిగా హోవిట్జర్ గన్ ను కూడా ఉపయోగించారు. ఎన్ సీసీ క్యాడెట్లు తమ తమ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వస్త్రాలంకరణతో వచ్చారు. ప్రోగ్రాం చివర్లో ప్రధాని మోడీ వారి వద్దకు వెళ్లి పలకరించారు.
రాష్ట్రాల్లోనూ ఘనంగా..
75వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, యూటీల్లోనూ ఘనంగా సంబురాలు జరిగాయి. గుజరాత్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతున్నట్లు సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో పార్కులకు ఫ్రీడం ఫైటర్ల పేరును పెట్టినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రకటించారు. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్, యూపీ, తదితర రాష్ట్రాలు, యూటీల్లోనూ ఇండిపెండెన్స్ డే వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇక హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్ లోకి 5 కోట్ల మంది జాతీయ జెండాతో సెల్ఫీలు దిగి అప్ లోడ్ చేశారని సోమవారం కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది.
విదేశాల్లో ఇలా..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఇండియన్ లు సోమవారం ఘనంగా సంబురాలు చేసుకున్నారు. ఆయా దేశాల్లోని ఎంబసీల వద్ద దౌత్య సిబ్బంది త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. బీజింగ్ లోని ఇండియన్ ఎంబసీ వద్ద మన అంబాసిడర్ ప్రదీప్ కుమార్ రావత్ జెండాను ఆవిష్కరించారు. చైనాలోని గ్వాంగ్ ఝౌ సిటీలోని ఇండియన్ కాన్సులేట్ వద్ద కూడా ఇండియన్ లు ఆటపాటలతో సంబురాలు చేసుకున్నారు. బ్రిటన్ లో ప్రధాని బోరిస్ జాన్సన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నేపాల్, బంగ్లాదేశ్, ఇజ్రాయెల్, యూఏఈ, కెనడా, మాల్దీవులు, తదితర దేశాల్లోని ఎంబసీల వద్ద కూడా త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు.
విదేశీ పోర్టుల్లోనూ..
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల పోర్టుల్లో ఇండియన్ షిప్లపైనా జాతీయ జెండా రెపరెపలాడింది. ఆపరేషనల్ డిప్లాయ్మెంట్లో భాగంగా ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో ఉన్న ఐఎన్ఎస్ సుమేధ నౌక సోమవారం ఆస్ట్రేలియాలోని పెర్త్ హార్బర్ లో డాక్ అయింది. అనంతరం ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్సెస్ సమక్షంలో జెండా ఆవిష్కరణ చేశారు. తూర్పు లండన్ తీరంలో ఐఎన్ఎస్ తరంగిణిపై, సింగపూర్ తీరంలో ఐఎన్ఎస్ సరయూపై జెండాను ఆవిష్కరించి వేడుకలు చేసుకున్నారు.
