న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షూటర్లు ఇలవేనిల్ వలారివన్–అర్జున్ బబూట జోడీ ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో వరల్డ్ రికార్డు బ్రేక్ చేస్తూ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో ఇలవేనిల్ –అర్జున్ 505.0 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఈ క్రమంలో వరల్డ్, ఆసియా చాంపియన్‌షిప్ రికార్డును నెలకొల్పడంతో ఆసియా టైటిల్‌ను నిలబెట్టుకున్నారు.
సౌత్ కొరియాకు చెందిన యూంజీ క్వోన్–కిమ్ వూరిమ్ జంట 501.0 పాయింట్లతో సిల్వర్‌ను సొంతం చేసుకుంది. జపాన్ షూటర్లు మిసాకి నొబాట–నయోయా ఒకాడ 437.1 పాయింట్లతో కాంస్యం కైవసం చేసుకున్నారు. ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ జూనియర్ ఫైనల్లో హిమాన్షు–శాంభవి 502.4 పాయింట్లతో గోల్డ్ మెడల్‌ను సాధించారు. ఈ క్రమంలో ఆసియా జూనియర్ రికార్డును నెలకొల్పారు.
శాంభవి 250.1, హిమాన్షు 252.3 పాయింట్లు గెలిచారు. కజకిస్తాన్ (488.6), మాల్దీవ్స్ (422.4) వరుసగా సిల్వర్, బ్రాంజ్‌ను నెగ్గాయి. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్‌లో గురుప్రీత్ సింగ్, హర్ష్ గుప్తా, అమన్‌ప్రీత్ సింగ్ వరుసగా స్వర్ణం, రజతం, కాంస్యం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ యూత్‌లో శరణ్ శిక్ష–గిరిష్ గుప్తా ద్వయం 476.7 పాయింట్లతో స్వర్ణాన్ని గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ జూనియర్ ఫైనల్లో వన్షిక చౌదరీ–నేలవల్లి ముకేశ్ 481.1 పాయింట్లతో గోల్డ్ సొంతం చేసుకున్నారు.
