గుట్టలో ఆన్​లైన్​ టికెటింగ్ ​సిస్టం షురూ.. ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

గుట్టలో ఆన్​లైన్​ టికెటింగ్ ​సిస్టం షురూ.. ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆన్​లైన్​ సేవలు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు మిల్లెట్స్ లడ్డూల విక్రయం, బంగారు, వెండి కాయిన్స్ ​అమ్మకాన్ని  విప్ గొంగిడి సునీతతో కలిసి ఎండోమెంట్ మినిస్టర్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ప్రధానాలయ ముఖ మంటపంలో లక్ష్మీనరసింహుల ప్రతిమ కలిగిన బంగారు, వెండి కాయిన్స్, మిల్లెట్స్ లడ్డూలను  విక్రయించారు. 80 గ్రాములుండే ఒక్కో లడ్డూ ధరను రూ.40గా నిర్ణయించారు. 3 గ్రాముల బంగారు కాయిన్​ను ఈవో గీతారెడ్డి రూ.21 వేలు చెల్లించి కొనగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి రూ.వెయ్యి చెల్లించి 5 గ్రాముల వెండి కాయిన్ ​కొన్నారు.

 తర్వాత కొండపై ఉన్న వీఐపీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్ సెటప్ ద్వారా ఆలయ వెబ్​సైట్​ఓపెన్​ చేసి ఆన్​లైన్​ టికెటింగ్ సిస్టం ప్రారంభించారు. http://yadadritemple.Telangana.gov.in వెబ్​సైట్​ద్వారా అన్ని రకాల టికెట్లు, సేవలు, గదులను బుక్ చేసుకోవచ్చని ఆఫీసర్లు తెలిపారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్​ఎలిమినేటి సందీప్ రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, జడ్పీటీసీ అనురాధ, మున్సిపల్ చైర్ పర్సన్ సుధ పాల్గొన్నారు.