- మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
- త్వరలో రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న ‘యూ కోట్ వీ.. పే పాలసీ’
- ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిన ఫ్యాకల్టీ భర్తీ
- ఇప్పుడున్న జీతానికి మూడు రెట్లు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం
- రాష్ట్ర ఖజానా నుంచి బేసిక్ సాలరీ... ఎన్‌హెచ్‌ఎం నుంచి మిగతా టాప్ అప్
- ఆసిఫాబాద్, ములుగు సహా 10 మెడికల్ కాలేజీల్లో అమలుకు కసరత్తు
హైదరాబాద్, వెలుగు: జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.మారుమూల జిల్లాల్లో ఉన్న మెడికల్ కాలేజీల్లో పనిచేస్తమంటే చాలు.. ‘అడిగినంత జీతం ఇస్తం.. రండి’ అంటూ కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొఫెసర్లకు బంపర్ ఆఫర్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు, ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు లేక వెలవెలబోతున్నాయి. రెగ్యులర్ రిక్రూట్ మెంట్ పెట్టినా, కాంట్రాక్ట్ పద్ధతిలో పిలిచినా.. సిటీ వదిలి జిల్లాలకు వెళ్లేందుకు ప్రొఫెసర్లు ముఖం చాటేస్తున్నారు.
దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ‘యు కోట్.. వీ పే’ అనే కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నది. దీని ప్రకారం డాక్టర్లే తమకు ఎంత జీతం కావాలో డిసైడ్ చేసి కోట్ చేయొచ్చు. అర్హతలు ఉండి తక్కువ కోట్ చేసిన వారికీ జాబ్ ఇస్తారు. ఈ మేరకు వైద్యవిద్య అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జీతం మూడు రెట్లు అధికం..
ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ ప్రొఫెసర్ కు నెలకు సుమారు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1.25 లక్షలు ఇస్తున్నారు. అయితే, ఈ కొత్త విధానంలో దీనిని ఏకంగా మూడు రెట్లు పెంచనున్నారు. ఉదాహరణకు ప్రొఫెసర్.. యూ కోట్.. వీ పే పాలసీలో రూ. 5.70 లక్షల వరకు కోట్ చేసే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్, వరంగల్ వంటి సిటీల్లో ఉండే ప్రొఫెసర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్, కార్పొరేట్ హాస్పిటల్స్ ద్వారా మంచి ఆదాయం ఉంటుంది. అదే ఆసిఫాబాద్, ములుగు వంటి ఏజెన్సీ ఏరియాల్లో ఆ అవకాశం ఉండదు. ఫ్యామిలీకి సరైన సౌకర్యాలు కూడా ఉండవు. అందుకే రెగ్యులర్ జీతాలకు అక్కడ ఎవరూ పనిచేయడం లేదు. ఈ గ్యాప్ పూడ్చేందుకే భారీ ప్యాకేజీని ఆఫర్ చేయనున్నరు.
ఎన్ఎహెచ్ఎం నుంచి అదనపు నిధులు..
ఈ స్కీమ్ లో ఎంపికైన కాంట్రాక్ట్ ప్రొఫెసర్లకు జీతాలను రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి చెల్లిస్తుంది. మిగిలిన అదనపు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ మిషన్ నిధుల నుంచి సర్దుబాటు చేస్తారు. ఆల్ ఇండియా స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చి, కాంట్రాక్ట్ పద్ధతిన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న డాక్టర్లు తమకు ఎంత జీతం కావాలో అప్లికేషన్ లో కోట్ చేయాలి..
తొలుత ఆ పది కాలేజీల్లో..
రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జోగులాంబ గద్వాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం సహా10 మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అనాటమీ, ఫిజియాలజీ వంటి ప్రీ-క్లినికల్ డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీల్లో ఈ ఖాళీలు బయటపడితే కాలేజీల పర్మిషన్లు పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ ‘యు కోట్.. వీ పే’ ద్వారా కీలకమైన డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్లను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం ద్వారా మారుమూల ప్రాంత పేదలకు స్పెషాలిటీ వైద్యం అందుతుంది. వైద్య విద్యార్థులకు క్లాసులు చెప్పేందుకు సీనియర్ ప్రొఫెసర్లు దొరుకుతారు. అయితే, రెగ్యులర్ ప్రొఫెసర్లకు కూడా ఈ స్థాయి పే స్కేల్ ఇస్తే బాగుంటుందని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.నరహరి, సెక్రటరీ జనరల్ లాలూ ప్రసాద్, ట్రెజరర్ ఎంకే రావూఫ్ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ప్రకటించిన అలవెన్స్ ను అమలు చేయాలని ప్రభుత్వానికి గుర్తుచేశారు.
