దిగొచ్చిన జొమాటో

దిగొచ్చిన జొమాటో

న్యూఢిల్లీ : రెస్టారెంట్ల దెబ్బకు జొమాటో దిగొచ్చింది. తన యాప్‌‌ నుంచి లేటెస్ట్ ఇన్‌‌ఫినిటీ డైనింగ్ ప్రొగ్రామ్‌‌ను తీసేసింది. జొమాటో తన ప్లాట్‌‌ఫామ్‌‌పై ఆఫర్  చేస్తోన్న భారీ డిస్కౌంట్లపై రెస్టారెంట్లు ఆందోళనకు దిగిన క్రమంలో  ఈ నిర్ణయం తీసుకుంది. ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతనే యాప్ నుంచి ఈ ప్రొగ్రామ్‌‌ను తీసేసినట్టు జొమాటో తెలిపింది. ‘ఇన్‌‌ఫినిటీ డైనింగ్‌‌పై ఫీడ్‌‌బ్యాక్ తీసుకున్నాం. 3 నగరాల్లో 300కి పైగా రెస్టారెంట్లలో ఈ ఇన్‌‌ఫినిటీ డైనింగ్ ప్రొగ్రామ్‌‌ను రెండు నెలల క్రితం ప్రారంభించాం. ఈ ప్రొగ్రామ్ ద్వారా జొమాటో గోల్డ్ సబ్‌‌స్క్రైబర్లు రెస్టారెంట్‌‌ మెను నుంచి అపరిమితమైన ఫుడ్‌‌ను,డ్రింక్స్‌‌ను నిర్దేశించిన ఒక ధరకు కొనుగోలు చేసుకోవచ్చు’ అని జొమాటో అధికార ప్రతినిధి చెప్పారు. అయితే జొమాటో ఆఫర్ చేస్తోన్న ఈ డైనింగ్ ప్రొగ్రామ్‌‌పై నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌‌ఆర్‌‌‌‌ఏఐ) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై లాగౌట్ క్యాంపెయిన్‌‌ను కూడా నిర్వహించింది.

జొమాటో ఈ ప్రొగ్రామ్‌‌ను వెనక్కి తీసుకోవడం రెస్టారెంట్ కంపెనీలకు  భారీ విజయమని ఎన్‌‌ఆర్‌‌‌‌ఏఐ ముంబై హెడ్ అనురాగ్ కట్రియర్ చెప్పారు. ఆగస్ట్ 14 నుంచి రెస్టారెంట్ అసోసియేషన్‌‌ లాగౌట్‌‌ మూవ్‌‌మెంట్‌‌ను చేపట్టింది. ఈ లాగౌట్ కార్యక్రమంలో భాగంగా చాలా రెస్టారెంట్ కంపెనీలు జొమాటో లాంటి ప్లాట్‌‌ఫామ్స్ నుంచి లాగౌట్ అయ్యాయి. రెండు వేల మేర రెస్టారెంట్లు వన్‌‌ప్లస్‌‌వన్ డీల్‌‌ నుంచి బయటికి వచ్చేశాయి. జొమాటో లాంటి ప్లాట్‌‌ఫామ్స్‌‌ ఆఫర్ చేసే డిస్కౌంట్లపైనే కాకుండా.. అవి చేజిక్కించుకుంటున్న డేటాపై కూడా రెస్టారెంట్ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిగ్ డేటాను వాడుతూ.. కస్టమర్లు ఎక్కువగా  ఏ రకమైన ఫుడ్‌‌ను కొంటున్నారు? ఏ ప్రాంతంలో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయో తెలుసుకుని.. క్లౌడ్ కిచెన్లను అవి ఏర్పాటు చేస్తున్నాయని రెస్టారెంట్లు ఆరోపిస్తున్నారు. అవి క్లౌడ్ కిచెన్లను ఏర్పాటు చేసి, పిజ్జా కోసం సెర్చ్ చేసే కస్టమర్లను తమ కిచెన్లవైపు దారి మళ్లిస్తున్నారని చెప్పారు. ఫుడ్ ప్లాట్‌‌ఫామ్‌‌లు చేస్తోన్న ఈ పనులు ఆందోళనకరంగా ఉన్నాయని రెస్టారెంట్ ఓనర్లంటున్నారు.