Zomato : డెలివరీ బాయ్స్ మోసం.. ఇకపై ఆటలు సాగవన్న సీఈఓ

Zomato : డెలివరీ బాయ్స్ మోసం.. ఇకపై ఆటలు సాగవన్న సీఈఓ

పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో జరుగుతున్న  స్కాంపై కంపెనీ ఫౌండర్ దీపేందర్ గోయెల్ సీరియస్ అయ్యారు. పేమెంట్ విషయంలో డెలివరీ బాయ్స్ చేస్తున్న మోసాన్ని తెలుసుకుని అవాక్కయ్యారు. వారు అలా చేసేందుకు అవకాశమిస్తున్న లోపాలను సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇంతకీ దీపేందర్ సీరియస్ కావడానికి కారణమేంటన్న అన్న విషయానికొస్తే.. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ కి కమిషన్ వస్తుంది. అదే కస్టమర్ కొంచెం దయ చూపితే.. ఆ కమిషన్ ఇంకొంచెం పెరుగుతుంది. కానీ పనిచేసే సంస్థకే టోకరా వేయాలని చూస్తే..? ఇదే ఐడియాతో కొంతమంది డెలివరీ బాయ్స్ పనిచేస్తున్నట్టు తాజాగా ఆ కంపెనీ యజమాని గుర్తించారు. జొమాటోలో జరుగుతున్న మోసం గురించి వినయ్ సాథి అనే కస్టమర్ లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు. తనకు ఈ లూప్స్ తెలియగానే గూస్ బంప్స్ వచ్చాయని.. ఆ కస్టమర్ చెప్పుకొచ్చారు. అదెలా అన్న విషయాన్ని కూడా అతను వివరించాడు.

తాను ఇటీవల ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వగా.. తనకు డెలివరీ ఇవ్వడానికి వచ్చిన బాయ్.. ఇకపై ఆర్డర్ పెట్టినప్పుడు ఆన్ లైన్ లో పేమెంట్ చేయొద్దని చెప్పినట్టు వినయ్ చెప్పారు. ఒకవేళ రూ.1000 విలువైన ఫుడ్ ఆర్డర్ చేస్తే..  మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి.. డెలివరీ అయ్యాక రూ.300 మాత్రమే చెల్లించాలని చెప్పాడట. ఇదెలా సాధ్యం అని అడిగితే.. అసలు సంగతి వివరించాడట. ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత అది నచ్చకపోతే కస్టమర్లు కొన్నిసార్లు పేమెంట్ ఇవ్వరు. ఆ నష్టాన్ని జొమాటో భరిస్తుంది. అయితే ఫుడ్ మాత్రం డెలివరీ అయినట్టు చూపిస్తారు. కస్టమర్ కి ఫుడ్ నచ్చలేదంటూ డబ్బులివ్వలేదని డెలివరీ బాయ్ రిపోర్ట్ రాసిస్తాడు. తాను కూడా అలాగే చేస్తానని వినయ్ కి డెలివరీ బాయ్ చెప్తానన్నాడట. అంటే రూ.1000 ఫుడ్ కస్టమర్ కి ఇచ్చేస్తారు. డెలివరీ బాయ్ కి రూ.300 మిగులుతుంది. మిగతా 700 కస్టమర్ కి లాభం. టోటల్ గా జొమాటోకి రూ. 1000 నష్టమన్నమాట. ఇలా చాలా మంది డెలివరీ బాయ్స్ చాలా కాలంగా చేస్తున్నా.. కస్టమర్స్ పెద్దగా పట్టించుకోకపోవడంతో విషయం బయటికి రాలేదు. కానీ తాజాగా వినయ్ అనే కస్టమర్ చేసిన పోస్ట్ తో  దీనిపై కంపెనీ నిఘా పెడతామంటోంది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో దీపేందర్ లూప్ హోల్స్ ని సరిదిద్దుతామని హామీ ఇచ్చారు.