కాన్పూర్: ఇరవై ఏండ్ల క్రితం బ్యాంకు లాకర్‌లో దాచుకున్న రూ.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు మాయమైన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కలకలం రేపింది. కాన్పూర్‌కు చెందిన రష్మి అరోరా (55) 2003 ఫిబ్రవరి 26 న తన భర్తతో కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ (ఎస్బీటీ)లో ఖాతా తెరిచారు. వారికి కేటాయించిన లాకర్ నంబర్ 23లో రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దాచుకున్నారు. కొన్నేండ్ల తర్వాత భర్త మరణించడంతో రష్మి లక్నోకు షిఫ్ట్ అయ్యారు.
ఈ క్రమంలో చాలాకాలం పాటు ఆమె బ్యాంకుకు వెళ్లలేదు. ఇటీవల బ్యాంకుకు వెళ్లగా.. ఎస్బీటీ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో విలీనమైందని, ఆమె పేరుపై ఎలాంటి లాకర్ లేదని బ్యాంక్ అధికారులు తెలిపారు. లాకర్ అద్దె ఆటోమేటిక్‌గా కట్ కావడంతో ఖాతా బ్యాలెన్స్ సున్నాకి చేరిందని బ్రాంచ్ మేనేజర్ చెప్పారు. జులై 21న ఖాతాను పునరుద్ధరించిన ఆమె, జులై 27న లాకర్ తెరిచి చూడగా అది ఖాళీగా ఉంది. బ్యాంకు మేనేజర్, సిబ్బంది కుమ్మక్కై తన బంగారాన్ని కాజేశారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బ్రాంచ్ మేనేజర్, సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై కాన్పూర్ డీసీపీ అతుల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.
