కంగారూను కాల్చేసిన పోలీసులు

కంగారూను కాల్చేసిన పోలీసులు
  • అంబులెన్స్​ సిబ్బందిపైనా దాడి

సిడ్నీ: ఓ కంగారూ తన యజమానినే చంపేసింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని రెడ్​మాండ్​ టౌన్​లో ఈ ఘటన జరిగింది. టౌన్​కు చెందిన ఓ 70 ఏండ్ల పెద్దాయన కంగారూను పెంచుకుంటున్నాడు. దానికి తిండి పెట్టడం సహా ఇతర అవసరాలకోసం ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నడు. ఆ పెద్దాయనను కలవడానికి  ఆదివారం మధ్యాహ్నం ఓ చుట్టపాయన వచ్చిండు. అయితే, ఇంట్లో తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న పెద్దాయనను చూసి అంబులెన్స్​కు, పోలీసులకు ఫోన్​ చేశాడు. కాసేపటికి అంబులెన్స్​తో అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది ఆ పెద్దాయనను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.

అక్కడే ఉన్న కంగారూ వారిని అడ్డుకుంది. పోలీసులపై దాడికి దిగింది. క్రూరంగా మారిన కంగారూతో ఇతరులకు ప్రాణహాని ఉంటుందని భావించిన పోలీసులు.. దాన్ని కాల్చి చంపేశారు. ఆపై పెద్దాయనను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు కన్ఫమ్​ చేశారు. తలతో పాటు ఛాతి భాగంలో బలమైన గాయాలు కావడంవల్లే ఆయన పాణం పోయిందని చెప్పారు. అయితే, చనిపోయిన వ్యక్తి పేరు, వ్యక్తిగత వివరాలు మాత్రం తెలియరాలేదని పోలీసులు చెప్పారు. ఆయన పెంచుకుంటున్న కంగారూ ఏడడుగుల ఎత్తు, 70 కిలోల బరువు ఉందని వివరించారు.