అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి 70 మంది గిరిజన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పలువురు విద్యార్థులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను హాస్టల్ సిబ్బంది చికిత్స కోసం వెంటనే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆరోగ్యం విషమంగా ఉన్న విద్యార్థులకు ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో వెంటనే రంపచోడవరం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. స్మరణ రాజ్, స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. విద్యార్థులను పరామర్శించి.. వైద్య చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఈ ఘటనను అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఫుడ్ పాయిజనింగ్‌కు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి విచారణకు ఆదేశించారు. ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ పంపారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలియగానే పరుగుపరుగున ఆసుపత్రికి తరలివచ్చారు.
