కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (మార్చి30న లోక్ సభలో) చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. సీఆర్ పాటిల్ వ్యాఖ్యలు, సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఒకేలా ఉన్నాయని.. దీనిని బట్టి కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న ఫెవికల్ బంధం మరోసారి బయటపడిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లేందుకు ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని హరీష్ రావు గుర్తు చేశారు. గతంలో నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టును తెలంగాణకు వరప్రదాయిని అని కొనియాడారని.. మాజీ గవర్నర్ నరసింహన్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి వరకు అందరూ కాళేశ్వరాన్ని ప్రశంసించారని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని విమర్శిస్తున్న వారు.. అదే ప్రాజెక్టు నీళ్లతో గంధమల్ల ప్రాజెక్టును నింపేందుకు శంకుస్థాపన ఎలా చేశారని ప్రశ్నించారు. ప్రాజెక్టు కొట్టుకుపోయిందని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. రంగనాయక సాగర్ నుంచి 8 వేల కోట్లతో కాల్వలు ఎందుకు తవ్వుతోందో సమాధానం చెప్పాలన్నారు.
సీఆర్ పాటిల్, కిషన్ రెడ్డి వస్తే కాళేశ్వరం నీళ్లు ఎక్కడెక్కడ పారుతున్నాయో తాను చూపిస్తానని సవాల్ విసిరారు హరీశ్ రావు . లక్ష కోట్లు కొట్టుకుపోయాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలే.. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఏడాది కొత్త ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చామని ఎలా చెబుతారని ఎద్దేవా చేశారు. కేవలం 50 కోట్లు ఖర్చు చేస్తే 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని తాను 20 సార్లు ఉత్తరాలు రాసినా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
