- బ్లాక్ మార్కెట్లో నాటు తుపాకులు
- అంతర్రాష్ట్ర గ్యాంగ్స్ వద్ద రూ.20 వేలకే తపంచా
- పోలీసుల తనిఖీలు లేకపోవడంతో ఆయుధాల దుర్వినియోగం
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ లో గన్ కల్చర్ పెరిగిపోతోంది. లైసెన్స్‌డ్ గన్స్ కన్నా అక్రమ తుపాకులే ఎక్కువగా హల్‌చల్ చేస్తున్నాయి. ప్రాణహాని ఉన్న వ్యక్తులే కాకుండా చోటామోటా లీడర్లు, రౌడీషీటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద ఉన్న తుపాకులు సామాన్యులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆత్మరక్షణ కోసం వాడాల్సిన ఆయుధాలను ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా ఉపయోగిస్తున్నారు. అలాగే బెదిరింపులు, ల్యాండ్ సెటిల్‌మెంట్స్ లోనూ అక్రమ తుపాకులను వాడుతున్నారు. ఓ వైపు లైసెన్స్ డ్ గన్స్, మరోవైపు కంట్రీమేడ్ రివాల్వర్స్, ఎయిర్ గన్స్ సిటిజన్ల సెక్యూరిటీని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్రమ ఆయుధాలను గుర్తించడంలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. అనుమతులు పొందిన వాటి కంటే ఎలాంటి లైసెన్స్ లేని తుపాకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. గన్ లైసెన్స్ ఉన్న కొంత మంది రూల్స్ కు విరుద్ధంగా యూపీ, బిహార్ నుంచి అక్రమంగా తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. తమ అనుచరులు, సెక్యూరిటీ గార్డులకు సఫారీ సూట్స్, గన్ పాకెట్లు కనిపించేలా హల్‌చల్ చేస్తున్నారు. పెళ్లి బరాత్‌లో గన్స్‌తో డ్యాన్సులు చేస్తున్నారు. లైసెన్స్‌డ్ ఆయుధాలతో కాల్పులు జరిపితే దొరికిపోతామనే భయంతో కొంతమంది కంట్రీమేడ్ రివాల్వర్స్ను (నాటు తుపాకీ) వాడుతున్నారు. బిహార్, యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లాంటి అంతర్రాష్ట్ర గ్యాంగ్స్ వద్ద గన్స్ కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి రూ.2 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించి నాటు తుపాకులను కొనుగోలు చేస్తున్నారు. వాటితో బెదిరింపులకు పాల్పడినా, కాల్పులు జరిపినా పోలీసులు గుర్తించే అవకాశాలు లేవు.
3 నెలలకోసారి తనిఖీ
గన్ లైసెన్స్ పొందాలంటే చాలా ప్రొసీజర్ ఉం టుంది. స్థానిక పోలీస్ కమిషనర్ లేదా జిల్లా కలెక్టర్ నుంచి గన్ లైసెన్స్ పొందాలి. గన్ లైసెన్స్ పొందాలనుకునే వారు తమకు ప్రాణహాని ఉందని అవసరమైన సాక్ష్యాధారాలను అందించాలి. వాటిని సమర్పించాక స్పెషల్ బ్రాంచ్ లేదా స్థానిక ఏసీపీ, డీఎస్‌పీ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. సంబంధిత అధికారులు ఇచ్చే రిపోర్టు ఆధారంగా గన్ లైసెన్స్‌పై నిర్ణయం తీసుకుంటారు. లైసెన్స్ పొందిన వారిని స్థానిక పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రతి మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేయాలి. గన్ లో బుల్లెట్ల సంఖ్య కరెక్ట్‌గా ఉందా అనే వివరాలు సమీక్షించాలి. కానీ, స్థానిక పోలీసులు ఎలాంటి తనిఖీలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో పోలీసుల అనుమతితో లైసెన్స్ పొందిన వారు కూడా గన్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారు.
గ్రేటర్‌లో 11,841 గన్స్, లెక్క లేని ఇల్లీగల్ వెపన్స్
గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు11,841 లైసెన్సుడ్గన్స్ ఉన్నాయి. వాటిలో 975 స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్‌మెన్, సెక్యూరిటీ ఏజెన్సీలకు చెందినవి ఉన్నాయి. ఇవే కాకుండా ఏటా గన్ లైసెన్సులకు అప్లికేషన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. బిజినెస్ మెన్, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు సహా ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉన్నవారు గన్ లైసెన్స్ కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. అయితే, ఇటీవల కాలంలో తుపాకులు దుర్వినియోగం అవుతుండడంతో నిబంధనలు కఠినతరం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే లైసెన్స్ మంజూరు చేస్తున్నారు.
