ఓటరు నమోదుకు లాస్ట్ ఛాన్స్..ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

ఓటరు నమోదుకు లాస్ట్ ఛాన్స్..ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

కొత్త ఓటరు నమోదుకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వ్యక్తుులకు ఇప్పుడే ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో స్పెషల్ సమ్మర్ రివిజన్-2023 పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటు హక్కు నమోదుకు ఛాన్స్  ఇచ్చింది. ఇందులో భాగంగా మే  25 బూత్ లెవల్ ఆఫీసర్స్  ఇంటింటి సర్వే ప్రారంభించారు. ఈ సర్వే జూన్ 23 వరకు నిర్వహిస్తారు. ఈ  సర్వేలో అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయడం, డబుల్‌ ఓటర్లు,  అడ్రస్ మారితే కూడా కొత్త చిరునామాకు  బదిలీ చేయించడం, చనిపోయిన వారి తొలగింపునకు దరఖాస్తులను స్వీకరించి ఓటరు జాబితాలో సవరణలు చేసి తుది జాబితాను  అక్టోబర్ 4న ప్రకటిస్తారు. 

పోలింగ్ కేంద్రాల గుర్తింపు..

ఇక జూన్ 24 నుంచి జూలై 24 వరకు రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలను బూత్ లెవల్ ఆఫీసర్లు గుర్తిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని పరిశీలిస్తారు. దీంతో పాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలపై నిర్ణయం తీసుకుంటారు. పాత పోలింగ్ కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే కొత్త పోలింగ్ కేంద్రాలను గుర్తించడం, అవసరం అయితే అదనపు పోలింగ్ కేంద్రాల కోసం ప్రతిపాదనలను బూత్ లెవల్ ఆఫీసర్లు సిద్ధం చేస్తారు

ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి...

ఓటు హక్కు కోసం పౌరులు జులై 31వ తేదీ వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి.  ఆగస్టు 2వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు. అగస్టు 2 నుంచి 31 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ మధ్యకాలంలో నూతన ఓటరు నమోదు, తొలగింపులు, మార్పులు, చేర్పులపై రెండు శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 22న అభ్యంతరాలను పరిశీలించి అక్టోబర్‌ 4న తుది ఓటరు జాబితాను వెల్లడిస్తారు.