పబ్లిక్ ఇష్యూ బాటలో ‘ఓలా’

పబ్లిక్ ఇష్యూ బాటలో ‘ఓలా’

న్యూఢిల్లీ: నిధుల సమీకరణ కోసం ఐపీఓ బాట పడుతున్న కంపెనీల సరసన ఓలా కూడా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. కనీసం 7400 కోట్ల నిధుల సమీకరణ కోసం ఓలా పబ్లిక్‌ ఇష్యూ జారీ చేసే అవకాశం ఉందని బిజినెస్ వార్త సంస్థలు చెబుతున్నాయి. పబ్లిక్‌ ఆఫర్‌ మేనేజ్‌ చేసేందుకు సిటీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా, మోర్గాన్‌ స్టాన్లీ సేవలను ఓలా తీసుకుంటున్నట్లు తెలియడంతో పబ్లిక్ ఇష్యూ లాంఛనమేనని తెలుస్తోంది. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంక్‌ ఓలాలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. 
కరోనా ఉధృతి తగ్గిపోయి మార్కెట్ ఇప్పుడిప్పుడే కుదుటు పడుతున్న తరుణంలో జొమాటో పబ్లిక్‌ ఆఫర్ విజయవంతం కావడం అనేక కంపెనీలకు జోష్ కల్పించింది. దీంతో  పేటీఎం, ఫార్మ్‌ ఈజీ, పాలసీ బజార్‌ కంపెనీలు కూడా పబ్లిక్‌ ఇష్యూకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. తాజాగా  ఒలా కూడా ఆస్ట్రేలియా, బ్రిటన్‌ దేశాల్లో సేవలు ప్రారంభించింది. ఈ నేపధ్యంలో పబ్లిక్ ఇష్యూ ద్వారా మార్కెట్లో దూసుకెళ్లేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.