నెలకు రూ. 50 వేల సంపాదనంటూ మోసం

నెలకు రూ. 50 వేల సంపాదనంటూ మోసం

హైదరాబాద్ : మొన్న కరక్కాయ.. నిన్న స్కానింగ్.. ఇవాళ వత్తుల మిషన్.. రోజుకో తరహా మోసం బయటపడుతోంది. అత్యాశకుపోయి అడ్డంగా బుక్కవుతున్నారు జనాలు. లేటెస్ట్ గా వత్తుల మిషన్ ల పేరుతో 10 కోట్లు కొట్టేసిన మోసం బయటపడింది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ లో ఈ సంఘటన జరిగింది. వత్తుల మిషన్ల ద్వారా నెలకు 30 నుంచి 50వేల వరకు సంపాదించవచ్చని బాలా స్వామి గౌడ్ అనే వ్యక్తి యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఒక్కో మిషన్ కు లక్షా 77 వేల వరకు వసూల్ చేశాడని ఆరోపిస్తున్నారు. మిషన్ తో పాటు ఒక్కోక్కరికీ 50 నుంచి 100 కేజీల దూది ఇచ్చాడని చెప్తున్నారు.

ఆ దూదితో వత్తులు చేసి మళ్ళీ బాలా స్వామి గౌడ్ కే అమ్మాలనేది రూల్. దీంతో చాలా మంది మిషన్లు కొని వత్తులు చేశారు. రెండు మూడు నెలలపాటు ఒత్తులు తీసుకుని డబ్బులు కూడా ఇచ్చారని చెబుతున్నారు బాధితులు. ఈ నమ్మకంతోనే చాలా మంది లక్షలు పోసి ఒత్తుల మిషన్లు కొన్నారు. కొన్ని రోజుల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. వత్తులు కొనే దిక్కులేదు.. అడ్వాన్స్ డబ్బులిచ్చినోళ్లకు మిషన్ల లేవు. ఫోన్లు చేస్తే అప్పుడిస్తామని..ఇప్పుడిస్తామంటూ సాగదీస్తున్నారని ఆరోపించారు. దీంతో మోస పోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 800 మంది బాధితులు  మోస పోయినట్టు తెలుస్తోంది. 

దళిత బంధు యూనిట్ గా ఓ లబ్దిదారుడు ఒత్తుల మిషన్లుకు కొటేషన్ ఇచ్చాడు. తనకు శాంక్షన్ అయిన 10లక్షల రూపాయలు బాల స్వామి గౌడ్ అకౌంట్లో పడినట్టు ఇల్లందుకుంట మండలం రేకుర్తికి చెందిన బాధితుడు చెప్తున్నాడు. మూడు నెలలుగా తిరుగుతున్నా.. మిషన్లు ఇవ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు.