సాహసాల స్టార్టప్​తో సక్సెస్

సాహసాల స్టార్టప్​తో సక్సెస్

కొండ కోనలూ.. వాటిపై మంచు తెరలు.. మధ్య మధ్యలో లోయలు.. నీటి గలగలలు.. వీటన్నింటి మధ్య చేసే సాహసాలు. ఇవన్నీ సరదాకి అయితే ఓకే .. కానీ స్టార్టప్​గా అంటే? ఆ  ఆటల్ని మించిన అడ్వెంచర్​. అయినా అడ్వెంచర్ చేయాల్సిందే అనుకున్నారు ఈ అన్నదమ్ములు. నలుగురూ వెళ్లేదారిలో కాకుండా తమకోసం కొత్త దారి వేసుకోవాలని ‘క్లిఫ్​ ఇన్​ అడ్వెంచర్స్​​’​  అనే స్టార్టప్​ని మొదలుపెట్టారు. సాహసించకపోతే జీవితంలో ఏదో కోల్పోయినట్టే అంటున్న వీళ్ల పేర్లు రవి తేజ, 
సాయి తేజ. ఈ హైదరాబాదీల సక్సెస్​ స్టోరీ వాళ్ల మాటల్లోనే...

‘‘ట్రావెలింగ్​ అంటే...ప్రకృతి, పచ్చదనాల్లో హాయిగా ఊపిరి పీల్చుకోవడం. కానీ అడ్వెంచర్​ ట్రావెలింగ్​ అలా కాదు..దీనిలో ప్రతి అడుగు ఓ సవాలు విసురుతుంది. దాన్ని దాటే ధైర్యాన్నీ నింపుతుంది. దారులన్నీ మూసుకుపోయినా బతకడం ఎలాగో నేర్పిస్తుంది. జీవితానికి బోలెడు అనుభవాల్ని, ఆనందాల్ని ఇస్తుంది. అందుకే స్టార్టప్​ కోసం సాహసాల్నే ఎంచుకున్నాం. ధైర్యాన్నే పెట్టుబడిగా పెట్టాం. మన దగ్గర పెద్దగా ఆదరణ లేని వాటర్​, రాక్​ రాఫ్టింగ్​, రాక్​ క్లైంబింగ్​, క్యాంప్​ఫైర్స్, హైక్స్​, సర్వైవల్​ క్యాంప్స్​ లాంటి అడ్వెంచర్​ స్పోర్ట్స్​పై అవేర్​నెస్​ కల్పిస్తున్నాం. అయితే ఈ స్టార్టప్​కి తొలి అడుగు మా చిన్నప్పుడే పడిందంటున్నాడు రవి తేజ. 

అట్రాక్ట్​ చేశాయి

చిన్నప్పుడు సెలవులొస్తే  ఆంధ్రప్రదేశ్​లోని  సీలేరులో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్లం. అక్కడ జలపాతాలు, సెలయేళ్లు, ఎత్తైన  గుట్టలపై ఉండే గుడి.. చాలా అట్రాక్ట్ చేశాయి మమ్మల్ని. అది మొదలు... ట్రావెలింగ్​ అంటే ఎక్కడ లేని ఉత్సాహంతో పరుగులు తీసేవాళ్లం. అలా మొదలైన మా ట్రావెలింగ్​కి ఊపిరి పోసింది మాత్రం స్కూల్​ ఎన్​.సి.సి (నేషనల్​ క్యాడెట్​ కార్డ్స్​). ఈ క్యాంప్స్​లో భాగంగా డిఫరెంట్​ ప్లేస్​లకి వెళ్లేవాళ్లం. అడ్వెంచర్​ స్పోర్ట్స్​ కూడా ఆడేవాళ్లం. దాంతో అడ్వెంచర్​ ట్రావెలింగ్​పై మరింత ఇంట్రెస్ట్​ వచ్చింది. కానీ, ఆ సాహసాలన్నింటికీ ఇంటర్మీడియెట్​ చదువు​ బ్రేక్ వేసింది. మళ్లీ డిగ్రీలో ఎన్​.సి.సి లో చేరాం. నేషనల్​ లెవల్స్​ క్యాంప్స్ చేశాం. అలా ఓసారి క్యాంప్​ కోసం నార్త్​కి వెళ్లినప్పుడు అడ్వెంచర్​ స్పోర్ట్స్​ యాక్టివిటీలో  పార్టిసిపేట్​ చేశాం. కానీ, మేము తప్పించి.. మిగతా వాళ్లంతా ఈజీగా ట్రెక్కింగ్​ చేశారు. అప్పుడనిపించింది  నార్త్​ వాళ్లకున్నంత ట్రెక్కింగ్​ నాలెడ్జ్​  మనకి లేదని. ఈ యునిక్​ స్పోర్ట్​ని నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా అక్కడే మొదలైంది. 

జాయిన్​ అయ్యా.. 

ట్రెక్కింగ్​ గురించి పూర్తిగా తెలుసుకోవాలని బలంగా ఉంది. కానీ, ఎలా అన్నదే మా ముందున్న ప్రశ్న. దాని కోసం తెలిసిన వాళ్లందర్నీ అడిగాం. చివరికి ‘తెలంగాణ మౌంటెనీరింగ్​ క్లబ్​’లో ఫ్రీగా ట్రెక్కింగ్​ నేర్పిస్తారన్న విషయం తెలిసి అక్కడికి వెళ్లాం. వాళ్లు పెట్టిన టెస్ట్​లన్నీ పాస్​ అవడంతో  మాకు కిరణ్​ కుమార్​, రాజేందర్​ ఆరు నెలల పాటు ట్రనింగ్​ ఇచ్చారు. అది పూర్తయ్యాక ఆ క్లబ్​లోనే ఫ్రీలాన్సర్స్​​​గా పనిచేశాం. వాళ్లు కండక్ట్​ చేస్తున్న ట్రెక్కింగ్​, హైకింగ్​ ఈవెంట్స్​లో పార్టిసిపేట్​ చేయబోయే గ్రూప్స్​కి  ట్రైనింగ్​ ఇచ్చాం. వాళ్లతో కలిసి కేదార్​​కాంత,  హర్​ కి దున్​​​, బాలి పాస్​, సందక్పు​ మౌంటెన్స్​పై ట్రెక్కింగ్​ చేశాం. వాటి వల్ల అడ్వెంచర్​ స్పోర్ట్స్​పై మరింత ఆసక్తి పెరిగింది.  దాంతో మా ప్యాషన్​నే ప్రొఫెషన్​గా మార్చుకోవాలని 2016లో డిసైడ్​ అయ్యాం. 

జీతమే..పెట్టుబడి 

నాన్న క్యాబ్​ నడిపేవారు. ఆయన సంపాదనతో మా కాలేజీ ఫీజులు, ఇంటి ఖర్చులు వెళ్లదీయడమే కష్టమయ్యేది. అలాంటి పరిస్థితుల్లో నాన్నపై మా స్టార్టప్​ భారాన్ని మోపడం కరెక్ట్​ అనిపించలేదు. అందుకే పెట్టుబడి కోసం ఉద్యోగంలో చేరా. ఆ సంపాదనతోనే  మౌంటెనీరింగ్‌‌‌‌లో సర్టిఫికేషన్ చేశా. మా తమ్ముడు సాయి చరణ్​ని  బేసిక్​ మౌంటెనీరింగ్​ కోర్సులో జాయిన్​ చేశా.  స్టార్టప్​కి కావాల్సిన  గేర్స్​ కూడా కొన్నా. చిట్టీలు కట్టి ఒక లక్ష రూపాయలు పోగు చేశా. ముందుగా టెస్టింగ్​ లెవల్స్​లో స్కూల్​, కాలేజీల్లో  అడ్వెంచర్​ స్పోర్ట్స్​పై అవేర్​నెస్​ కల్పించాం. ఆ తర్వాత ఉద్యోగం మానేసి చేతిలో ఉన్న ఆ కొద్ది డబ్బుతోనే  2019 లో ‘క్లిఫ్​ ఇన్​ అడ్వెంచర్స్​’ ని మొదలుపెట్టాం. 

ఇందులో ‘క్లిఫ్’​.. మౌంటెయిన్​ని, ‘ఇన్’​.. స్టే​, ఫుడ్​ని, ‘అడ్వెంచర్’​.. అడ్వెంచర్​ గేమ్స్​ని రిప్రజెంట్​ చేస్తుంది. అయితే మొదట్లో అన్ని స్టార్టప్స్​లాగానే మా స్టార్టప్​కు చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఆఫీసుకి స్పేస్ తీసుకునేంత  స్తోమత లేదు. అలాగే మార్కెటింగ్​కి చేతిలో డబ్బు లేదు. అయినా నిరుత్సాహ పడలేదు. సోషల్​ మీడియా, మా ఫ్రెండ్​ సర్కిల్​ ద్వారా కంపెనీని ప్రమోట్​ చేసుకున్నాం. తర్వాత మా ఆలోచన నచ్చి ఇన్వెస్టర్​​​ వెతుక్కుంటూ వచ్చారు. కొందరు పార్ట్​నర్స్​ కూడా తోడయ్యారు.

ఇతర రాష్ట్రాల్లోనూ..

ప్రతి నెలా 4 ఈవెంట్స్​ కండక్ట్​ చేస్తాం. అందులో ఒకటి స్కూల్​ పిల్లలు, ఎన్​సిసి స్టూడెంట్స్​ కోసం ఫ్రీగా చేస్తాం. మిగతా మూడింటిలో ప్రతి ట్రిప్​కి 20 నుంచి 25మంది ట్రావెలర్స్​ ఉంటారు. ప్రతి పదిమందికి ఒక గైడ్​ని ఇస్తాం. ట్రావెలింగ్​ అయితే ఎక్కువగా గోకర్ణ , దండేలి, హంపి, ఊటి, మనాలి, కొడైకెనాల్​ లాంటి ప్లేస్​లకి తీసుకెళ్తాం. ట్రెక్కింగ్​ అయితే హిమాలయాల లాంటి మౌంటెన్​ ఏరియాలకి తీసుకెళ్తుంటాం. వాళ్లు ఎంచుకున్న ట్రిప్​ని బట్టి ముందుగానే రోప్​ కోర్సు, రాక్ క్లైంబింగ్, బౌల్డరింగ్, ర్యాప్లింగ్, హైకింగ్​ అండ్​ ట్రెక్కింగ్​లో ట్రైనింగ్​ ఇస్తాం. వర్క్​ షాప్స్​ కూడా కండక్ట్​ చేస్తాం. 

తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాఖండ్​, లడక్, మహారాష్ట్ర, గుల్మార్గ్, బెంగళూరు, ఢిల్లీ, ఆగ్రాల్లో మాకు టీమ్స్​ ఉన్నాయి. ట్రావెలర్ బస్సు ఎక్కిన దగ్గర్నించి.. వాళ్లు తిరిగి ఇంటికి చేరుకునే వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం.

అదే గోల్​ .. 

వింటర్​ సీజన్​లో ట్రావెల్​ ట్రిప్స్​ ఎక్కువ. వర్షాకాలంలో హైకింగ్​ ట్రిప్స్, సమ్మర్​లో స్నో ట్రెక్కింగ్స్ ఉంటాయి. ఎండాకాలం పిల్లల కోసం క్యాంప్స్​ కూడా ఏర్పాటు చేస్తాం. మా ట్రావెలర్స్​లో 20 నుంచి 35 యేండ్ల లోపు వాళ్లే ఎక్కువ.  ‘క్లిఫ్​ ఇన్​ అడ్వెంచర్స్​’​ని  ట్రావెల్, ట్రెక్కింగ్​కి​ ది బెస్ట్​​ ఛాయిస్​గా చేయాలన్నదే మా గోల్. అలాగే అడ్వెంచర్​  స్పోర్ట్స్​ని అందరి లైఫ్​లో భాగం చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా స్కూల్, కాలేజీల్లో వీటి గురించి అవేర్​నెస్​ కల్పించాలి అనుకుంటున్నాం”  అని వాళ్ల అడ్వెంచర్​​ స్టార్టప్ జర్నీ గురించి చెప్పారు రవి, సాయి.

::: ఆవుల యమున