75 ఏళ్ల వయసులో సైకిల్, రన్నింగ్ రేసుల్లో పతకాలు

75 ఏళ్ల వయసులో సైకిల్, రన్నింగ్ రేసుల్లో పతకాలు
  • 75ఏళ్ల వయసులో  సైకిల్, రన్నింగ్ రేసుల్లో పతకాలు​ గెలిచిన సుభాష్ పాండే

కొన్ని కథలు మనసుని కదిలిస్తాయి. ఏదైనా సాధించగలమనే ధైర్యాన్నిస్తాయి. అప్పటివరకూ అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసి చూపెడతాయి. పదిమందికి  ఆదర్శంగా నిలబెడతాయి. 75 ఏళ్ల సుభాష్​ పాండే జీవితంలోనూ అదే జరిగింది. ఒక కథ ఈ హైదరాబాదీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సైక్లింగ్​, రన్నింగ్​లో ఎన్నో అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏంటా కథ?ఎవరీ సుభాష్​ పాండే? 
అది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సుభాష్​ పాండే రైల్వేలో పనిచేసి రిటైర్​ అయ్యాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు రిటైర్​మెంట్​ తర్వాతి జీవితం గురించి బోలెడు కలలు కన్నాడు. కానీ, కొద్దిరోజులకే ఆయన కలలన్నీ తేలిపోయాయి. దాంతో ఏదో తెలియని వెలితి వెంటాడింది. రోజంతా ఇంట్లో ఉండటం వల్ల తనని తాను కోల్పోతున్నట్టు అనిపించింది సుభాష్​కి. దాంతో  భార్య పనిచేస్తున్న స్కూల్​లో టీచర్​గా చేరాడు. ఆ ఉద్యోగమే అతన్ని 75 ఏళ్ల వయసులో సైక్లిస్ట్​ని చేసింది. 
ఆ కథ కదిలించింది
అందరు టీచర్స్​లా స్టూడెంట్స్​కి  పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే చెప్పాలనుకోలేదు సుభాష్. వాళ్లని ఇన్​స్పైర్​ చేయడానికి ఎన్నో సక్సెస్​ఫుల్​ కథల్ని ఎంచుకున్నాడు. అలా ఒకరోజు పిల్లలకి ఎవరెస్ట్ ఎక్కిన మొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్ గురించి చెప్పాడు. ఆమె ​ కథ విని స్టూడెంట్స్ చప్పట్ల వర్షం కురిపించారు. ‘పెద్దయ్యాక మేం కూడా ఎవరెస్ట్​ ఎక్కుతాం సర్’​ అని  చెప్పారు. ఆ వెంటనే ‘అరుణిమ సిన్హా’  అనే మరో ఇన్​స్పైరింగ్​ కథ క్లాస్​లో వినిపించింది. అయితే ఈ కథ  కేవలం స్టూడెంట్స్​నే కాదు ఆయన్ని కూడా కదిలించింది. ఆర్టిఫిషియల్​ కాలుతో అరుణిమ ఎవరెస్ట్​ ఎక్కిందని తెలిశాక..నేనెందుకు ట్రై చేయకూడదు అనుకున్నాడు సుభాష్. ఆ ఆలోచనే అతడి రన్నింగ్​, సైక్లింగ్​ వైపు నడిపించింది. నాసిక్​లో జరిగిన నేషనల్​ వెటరన్స్​ స్పోర్ట్స్​ అండ్​ గేమ్స్​ ఛాంపియన్​షిప్​లో నాలుగు మెడల్స్​ గెలుచుకునేలా చేసింది. అది కూడా మోకాలి– రీప్లేస్​మెంట్​ సర్జరీ తర్వాత. 
అయితే ఏంటి?
సుభాష్​ రెండు మోకాళ్లకి నీ రీప్లేస్​మెంట్​ సర్జరీ అయింది. ఆపరేషన్​ తర్వాత ‘నువ్వు ఎప్పటికీ పరిగెత్తలేవ’ని చెప్పారు డాక్టర్లు. అయినా ధైర్యం చెడకుండా మెల్లిగా నడక మొదలుపెట్టాడు సుభాష్​. కొద్దిరోజుల్లోనే అందర్నీ సర్​ప్రైజ్​ చేస్తూ పరిగెత్తాడు. ప్యాండెమిక్​లో సైకిల్​ కూడా ఎక్కాడు. లాక్​డౌన్​లో వీధులన్నీ ఖాళీగా ఉండడంతో ఇంటి దగ్గర్లో రోజుకి పన్నెండు గంటలు సైకిల్  ప్రాక్టీస్​ చేశాడు. వీకెండ్స్​లో పది, ఇరవై కిలోమీటర్లు సైకిల్​పైనే తిరిగాడు. కానీ, అంతలోనే అతనికి ప్రతి అడుగులో తోడుండే భార్య చనిపోయింది. ఒక్కసారిగా జీవితం చీకటిగా అనిపించింది. ఆ బాధ నుంచి బయటపడటానికి మళ్లీ సైక్లింగ్​నే ఎంచుకున్నాడు సుభాష్. మార్చిలో తన భార్య జ్ఞాపకంగా నలభై కిలోమీటర్లు సైకిల్​ రైడ్ చేశాడు. ఈ నెల ​ పదకొండు నుంచి పద్నాలుగు వరకు నాసిక్​లో జరిగిన మొదటి నేషనల్​​ వెటరన్​​ స్పోర్ట్స్​ అండ్​ గేమ్స్​ ఛాంపియన్​షిప్​లోనూ పార్టిసిపేట్ చేశాడు సుభాష్​. పదికిలోమీటర్ల రన్నింగ్​ కేటగిరీలో  బ్రాంజ్​ మెడల్​ గెలుచుకున్నాడు. 30 కిలోమీటర్ల సైక్లింగ్​లో గోల్డ్​ మెడల్​, ఐదు కిలోమీటర్ల రన్నింగ్​, వాకింగ్​ ఈవెంట్​లలో రెండు బ్రాంజ్​ మెడల్స్​ గెలుచుకుని ఎందరికో ఇన్​స్పిరేషన్​ అయ్యాడు. వచ్చేనెల ఐదున తన 53 వ వెడ్డింగ్​ యానివర్సరీ సందర్భంగా సైకిల్​పై మల్కాజిగిరి నుంచి యాదగిరిగుట్ట వెళ్లే ప్లాన్​లో ఉన్నాడు ఈ సైక్లిస్ట్​.