ఆపరేషన్​ కగార్​ను వెంటనే ఆపాలి.. పౌర హక్కుల సంఘం డిమాండ్

ఆపరేషన్​ కగార్​ను వెంటనే ఆపాలి.. పౌర హక్కుల సంఘం డిమాండ్
  •      దండకారణ్యంలో పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలి

ముషీరాబాద్, వెలుగు :  ఛత్తీస్ గఢ్​దండకారణ్యంలో కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. అక్కడ ఏర్పాటు చేసిన అన్ని పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని కోరింది. దండకారణ్యంలో మారణ హోమాన్ని ఆపాలంటూ శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పౌర హక్కుల సంఘం, ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.

ప్రొఫెసర్ హరగోపాల్, రచయిత నందిని సిధారెడ్డి, కవి శివారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహరావు, సీపీఎంఎల్​న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వేములపల్లి వెంకటరామయ్య పాల్గొని మాట్లాడారు. వందల పోలీస్ క్యాంపులు, పారా మిలిటరీ బలగాలతో దండకారణ్యాన్ని నింపి మారణ హోమాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్​సంస్థల లాభాల కోసమే ఆపరేషన్​కగార్​చేపట్టారని ఆరోపించారు.

ప్రతిఒక్కరూ గొంతెత్తి ఆదివాసీల హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు. ఛత్తీస్​గఢ్​సీఎం మావోయిస్టులతో శాంతి చర్చలు కొనసాగించాలని కోరారు. ఎన్​కౌంటర్ల నిజనిర్ధారణకు హక్కుల సంఘాలకు అవకాశం కల్పించాలని డిమాండ్​చేశారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.