మమ్మల్ని, బర్లను..  ఆకలితో సంపుతున్నరు!

మమ్మల్ని, బర్లను..  ఆకలితో సంపుతున్నరు!
  • హర్యానాలో వారం రోజులుగా 
  • గోస పడుతున్న తెలంగాణ దళిత రైతులు

జనగామ, వెలుగు: పాడి స్కీంలో భాగంగా బర్రెల కోసం హర్యానా వెళ్లిన దళిత రైతులు వారం రోజులుగా అక్కడ గోస పడుతున్నరు. ఎస్సీ కార్పొరేషన్​ఆఫీసర్లు తమగురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమతో పాటు బర్లను కూడా ఆకలితో సంపుతున్నరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామను 2018–19 సంవత్సరంలో మినీ డెయిరీ పథకానికి పైలెట్​ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రభుత్వం 42 మంది లబ్ధిదారులను అప్పట్లో ఎంపిక చేసింది. ఒక్కో  యూనిట్​విలువ రూ. 4 లక్షలు కాగా ఇందులో రూ 2.4 లక్షలు సబ్సిడీ ఉంది. ఇన్నాళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన లబ్ధిదారులను ఎట్టకేలకు ఈ నెల 10న హర్యానా రాష్ట్రం జింద్​జిల్లాకు బర్ల సెలక్షన్​ కోసం పంపించారు. వెళ్లిన రైతులకు మొదటి నుంచి ఇక్కట్లు తప్పడం లేదు. పశువుల దొడ్లల్లో షెల్టర్, దొడ్డు బువ్వ, దోమలతో సావాసం కారణంగా రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
ఇగిత్తం.. అగిత్తం
ఇగిత్తం.. అగిత్తం అంటూ రిజెక్ట్​ చేసిన బర్లనే మళ్లీ మళ్లీ చూపిస్తూ వారం రోజులుగా బ్రోకర్లు ఇబ్బందులు పెడుతున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. షెడ్లలో బర్లుంటయ్​.. నచ్చినవి సెలెక్ట్​ చేసుకుని వెంటనే వచ్చేయవచ్చు అని చెప్పిన కార్పొరేషన్​ ఆఫీసర్లు పట్టించుకుంటలేరని ఆరోపిస్తున్నారు. బ్రోకర్లు​ఊర్లళ్ల తిరిగి ప్రతిరోజు ఒకటి నుంచి 8 వరకు బర్లను చూపిస్తున్నారని, అవి నచ్చడం లేదని అంటున్నారు. అయినా తిప్పి తిప్పి అవే బర్లను అంటగట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. వారం క్రితం 42 మంది రైతులు హర్యానా వెళ్తే ఇప్పటివరకు 20 మంది సోమ,  మంగళవారాల్లో రిటర్న్​అయినట్లు చెప్పారు.
వారం రోజుల ప్రయాణం
తమను పశువుల దొడ్లల్లో ఉంచి కడుపు మాడ్చినట్లుగానే సెలెక్ట్​ చేసుకున్న బర్లను ఆకలికి చంపుతున్నారని రైతులు వాపోతున్నారు. హర్యానా నుంచి తెలంగాణకు బర్లు తరలించేందుకు కొంత టైం పడుతుండగా వాటికి అప్పటివరకు దాణా సరిగా వేయడం లేదంటున్నారు. దాంతో రోజురోజుకు బర్లు బక్కచిక్కి పోతున్నాయని చెబుతున్నారు. ఒక ట్రక్కులో 8 బర్లను తీసుకురావాల్సి ఉండగా 12 వరకు తరలిస్తూ మూగ జీవాలను ఇబ్బందులు పెడ్తున్నట్లు చెప్పారు.

గోస పడ్తున్నం
వారం కింద హర్యానా వచ్చినం. బర్లదొడ్లల్ల ఉండమన్నరు. దోమలు, కంపు వాసన భరించలేకపోతున్నం. రిజెక్ట్​ చేసిన బర్లనే మళ్లీ మళ్లీ చూపిస్తున్నరు. మమ్మల్ని ఆకలికి సంపుతున్నరు. సెలెక్ట్​ చేసుకున్న బర్లకు దాణా పెడ్తలేరు. కార్పొరేషన్​ ఆఫీసర్లకు చెప్తే పట్టించుకుంటలేరు.
                                                     - నీర్మాల రత్నం, పెంబర్తి, జనగామ మండలం