థర్డ్​ వేవ్​ రావచ్చు.. ప్రజలంతా అలర్ట్​గా ఉండాలె

థర్డ్​ వేవ్​ రావచ్చు.. ప్రజలంతా అలర్ట్​గా ఉండాలె
  • రేపో, మాపో ఒమిక్రాన్ రాష్ట్రంలోకి వస్తది
  • జనవరి 15 నుంచి కేసులు పెరుగుతయ్​

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రేపో, మాపో మన రాష్ట్రంలోకీ రావొచ్చని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ (డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. వచ్చే నెలలోనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. రాష్ట్రంలో జనవరి 15 తర్వాత నుంచి కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరిలో కేసులు పీక్ స్టేజీకి చేరుతాయని, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని వెల్లడించారు. ఆదివారం కోఠిలోని కరోనా కంట్రోల్‌‌ రూమ్‌‌లో  మీడియాతో ఆయన మాట్లాడారు. సౌత్‌‌ ఆఫ్రికాలో ఒమిక్రాన్‌‌ కేసులు భారీగా పెరిగాయన్నారు. మన దేశంలోనూ పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో కూడా రేపో, మాపో ఒమిక్రాన్ వస్తుందని, ఇందులో సర్ ప్రైజ్ కావాల్సిందేమీ లేదన్నారు. డెల్టా కంటే ఒమిక్రాన్ స్పీడ్‌‌గా వ్యాపిస్తున్నప్పటికీ, దాని తీవ్రత మాత్రం తక్కువగానే ఉందన్నారు. ఈ వేరియంట్ సోకిన వాళ్లలో ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసం, అలసట వంటి లక్షణాలు ఉంటున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. ఈ లక్షణాలు ఉంటే దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి టెస్ట్ చేయించుకోవాలన్నారు. మాస్కు తప్పనిసరిగా వాడాలని, ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దని సూచించారు. కరోనా కేసులపై ఎప్పటికప్పుడు తాము మీడియా ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తామన్నారు.

వాళ్లంతా బాగున్నరు

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించిన11 దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చినవారిలో 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని డీహెచ్ తెలిపారు. ప్రస్తుతం వాళ్లంతా గచ్చిబౌలి టిమ్స్‌‌లో ఐసోలేషన్‌‌లో ఉన్నారని, అందరి హెల్త్ బాగానే ఉందన్నారు. వీరి నుంచి శాంపిల్స్ తీసుకుని జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టుల కోసం పంపామని, ఆ రిపోర్టులు సోమవారం వచ్చే అవకాశం ఉందన్నారు. 

చల్మెడ మెడికల్ కాలేజీలో 39 మందికి కరోనా
వారం సెలవులిచ్చిన మేనేజ్​మెంట్​

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్‍లో ఆదివారం కరోనా కలకలం రేగింది. చల్మెడ మెడికల్ కాలేజీలో 39 మంది స్టూడెంట్లకు పాజిటివ్ వచ్చింది. దీంతో మేనేజ్ మెంట్ వారం రోజులు సెలవులు ప్రకటించింది. బాధితులకు ట్రీట్ మెంట్ అందిస్తోంది. వారి కాంటాక్టులపై ఆరా తీస్తోంది. కాలేజీలో ఐదు రోజుల క్రితం ఫేర్ వెల్ పార్టీ జరిగింది. ఈ ఫంక్షన్ వల్లనే వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇందులో స్టూడెంట్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

156 కేసులు.. ఒకరు మృతి

రాష్ట్రంలో మరో 156 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. ఆదివారం 25,693 మందికి టెస్టులు చేస్తే.. గ్రేటర్ హైదరాబాద్‌‌లో 54 మందికి, జిల్లాల్లో 102 మందికి పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,76,943కి చేరిందని అధికారులు తెలిపారు. వీరిలో 6,69,157 మంది కోలుకున్నట్టుగా చూపించారు. రాష్ట్రంలో మరో 3,787 యాక్టివ్‌‌ కేసులు ఉన్నాయని, 1,283 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మిగిలిన వాళ్లు హోమ్ ఐసోలేషన్‌‌లో ఉన్నారన్నారు. కరోనాతో ఆదివారం ఒకరు చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య 3,999కి పెరిగిందని బులెటిన్‌‌లో పేర్కొన్నారు. ఎట్ రిస్క్ జాబితాలోని దేశాల నుంచి ఆదివారం 291 మంది రాష్ట్రానికి వచ్చారని, వారిలో ఎవరికీ పాజిటివ్‌‌ రాలేదని తెలిపారు.