ప్రభుత్వాలు చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరిగే పనులకు అస్సలు పొంతన లేదని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. రైతు వద్ద పంట కొనుగోళ్లు నిలిపివేయాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే క్యాబినెట్‌లో అనడం శోచనీయమన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ముగ్గురు మంత్రుల కమిటీ.. కేవలం ఈ ఏడాది మాత్రమే పంట కొనుగోళ్లు చేస్తామని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
ఫార్మా సిటీ ప్రాంతంలో అసలేం జరుగుతోంది? అనే అంశంపై హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించాలి.. పోరాడాలి.. పరిష్కరించాలి అనే నినాదంతోనే తాను పార్టీ పెట్టానని కవిత స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిస్సిగ్గుగా 13,500 ఎకరాలను లాక్కుంటే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంఫ్యూచర్ సిటీ పేరుతో ఏకంగా 30 వేల ఎకరాలను లాక్కునేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ఫార్మా సిటీలో ఉద్యోగాల కల్పనపై స్పష్టత లేదని, డేటా సెంటర్ల వల్ల వచ్చే కాలుష్యంతో పిట్టలు కూడా బ్రతకలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో పట్టా భూములున్న రైతుల జోలికి రావొద్దని హెచ్చరించారు. భూస్వాముల భూములను వదిలేసి, గిరిజనుల భూములు లాక్కోవడం దారుణమని, బాధితులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో రైతులకు, ఉద్యమకారులకు జరిగిన నష్టంలో తాను కూడా భాగస్వామినేనని అంగీకరించారు. ఆ పాపాలను కడుక్కోవడానికే, ఇప్పుడు రైతుల పక్షాన పోరాడుతున్నానని కవిత ప్రకటించారు.రైతుల కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించిన కవిత.. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
