రైలులో మహిళకు నొప్పులు.. పురుడు పోసిన తోటి ప్రయాణికులు.. కిక్కిరిసిన జనరల్ బోగీలో అద్భుతం

రైలులో మహిళకు నొప్పులు.. పురుడు పోసిన తోటి ప్రయాణికులు.. కిక్కిరిసిన జనరల్ బోగీలో అద్భుతం

నడుస్తున్న రైలు.. మహారాష్ట్ర పూణె నుంచి వెళుతుంది. అందులో జనరల్ బోగీ.. కిక్కిరిసిపోయింది. కాలు పెట్టేంత సందులేదు.. రైలు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.. అర్థరాత్రి. ఓ మహిళ పెద్దగా అరుపులు.. పురిటి నొప్పులతో బాధపడుతుంది. రైలు ఆగటానికి సమీపంలో రైల్వేస్టేషన్ లేదు.. రైలు ఆగే పరిస్థితి అంతకన్నా లేదు. ఈ క్రమంలోనే జనరల్ బోగీలోని తోటి మహిళా ప్రయాణికులు చొరవ తీసుకున్నారు. అప్పటికప్పుడు ఆ మహిళకు పురుడు పోశారు. పండండి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి, పుట్టిన ఆ బిడ్డ క్షేమంగా ఉన్నారు.. ఇండియాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.....

అది శనివారం సాయంత్రం.. పూణే నుండి బీహార్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల గర్భిణీ రుఖ్సానా ఖాతున్, తన భర్త జమీల్‌తో కలిసి ప్రయాణిస్తోంది. రైలు అహల్యానగర్ స్టేషన్ సమీపిస్తుండగా, ఊహించని విధంగా రుఖ్సానాకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. చుట్టూ జనం.. వేగంగా వెళ్తున్న రైలు.. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో  వైద్య సహాయం పొందడానికి  ఆ దంపతులు ఇబ్బంది పడ్డారు.

సమయస్ఫూర్తితో స్పందించిన ఆర్పీఎఫ్ పోలీసులు
అత్యవసర పరిస్థితి గురించి సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'ఆపరేషన్ మాతృశక్తి'కి శ్రీకారం చుట్టారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోమనాథ్ పఠాడే, హెడ్ కానిస్టేబుల్ విశ్వజీత్ కాక్డే వెంటనే ఆ కిక్కిరిసిన  జనరల్ కోచ్ వద్దకు పరుగెత్తుకెళ్లారు. అప్పటికే రుఖ్సానా పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, ఆమెను కంపార్ట్‌మెంట్  బయటకు తీసుకెళ్లడం గానీ, సమయానికి ఆసుపత్రికి తరలించడం గానీ సాధ్యం కాదని అర్థం చేసుకున్నారు.

కోచ్‌లోనే కాన్పు..  
వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది, కోచ్‌లో ప్రయాణిస్తున్న తోటి  మహిళాలతో కలిసి, రైలు లోపల సురక్షితమైన ప్రసవం జరిగేలా చూసేందుకు ఒక రక్షిత వాతావరణాన్ని సృష్టించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే, రుఖ్సానా ఒక ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ నవజాత శిశువు ఏడుపు ప్రయాణికులకు ఉపశమనం, ఆనందాన్ని కలిగించింది.

సురక్షితంగా ఆసుపత్రికి..
రైలు రాకముందే రైల్వే అధికారులు అహల్యానగర్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించి, 108 అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. రైలు ఆగిన తర్వాత, వైద్యులు, అంబులెన్స్ సిబ్బంది తల్లిని, నవజాత శిశువును సివిల్ ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కష్టకాలంలో రైల్వే సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి, తోటి ప్రయాణికులు అందించిన సహకారం ఒక ప్రాణాన్ని నిలబెట్టడమే కాకుండా, ఓ పసి ప్రాణాన్ని  క్షేమంగా భూమి మీదకు రావడానికి కారణమైంది.