
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో గుర్రం ఎవరో, గాడిద ఎవరో అందరికీ తెలుసన్నారు. శుక్రవారం సీఎల్పీలో ఎమ్మెల్యే మందుల సామేల్ తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు గుర్రం విలువ తెలుసుకున్నందువల్లే సీఎంగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారని చెప్పారు. రేవంత్ రేసుగుర్రం అయితే కేటీఆర్ కుంటిగుర్రం అని ఎద్దేవా చేశారు.
ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని చాచికొట్టి ఫామ్ హౌస్ కు పరిమితం చేసినా.. కేటీఆర్ తీరు మారలేదన్నారు. పెండపై తిరిగే పురుగు లాంటివాడు కేటీఆర్ అని, పూజకు పనికిరాని పువ్వు అని విమర్శించారు. కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేవని స్వయానా ఆయన చెల్లె కవితే తేల్చి చెప్పిందన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ కేటీఆర్ డ్రగ్స్ తీసుకొని సోయి తప్పి మాట్లాడుతున్నాడన్నారు. ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ధి మారలేదని మండిపడ్డారు.