రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ఫేమస్ ‘జంగిల్ బుక్’ కథలోని ‘మౌగ్లీ’ పాత్ర అందరికీ గుర్తే ఉంటుంది. అడవిలో జంతువుల మధ్య పెరిగిన ఆ బాలుడి కథ చదువుకోవడానికి బాగానే ఉంటుంది. అయితే నిజ జీవితంలో అలాంటి ఒక ‘మౌగ్లీ గర్ల్’ ఉందంటే నమ్ముతారా? ఉత్తరప్రదేశ్ అడవుల్లో ఒంటరిగా దొరికి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ అమ్మాయి పేరు ‘ఎహ్‌సాస్’. అయితే అడవి మనుషులను దాటుకుని ఇప్పుడిప్పుడే నాగరిక ప్రపంచానికి అలవాటుపడుతున్న ఆమె.. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఊపిరితిత్తుల వ్యాధితో లక్నోలోని ఆసుపత్రిలో మరణించింది. ఈ వింత బాలిక జీవితంలోని ఎన్నో ఆసక్తికరమైన కోణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆమె గురించి మెుదటి సారి అందరికీ తెలిసింది 2017 జనవరిలో. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో గల కటర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోని మోతీపూర్ రోడ్డుపై ఈ బాలిక ఒంటరిగా సంచరిస్తూ కనిపించింది. ఆమెను రక్షించినప్పుడు ఆమె ప్రవర్తన అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. మనుషులను చూస్తే భయపడి పారిపోవడం, బట్టలు వేసుకోవడానికి నిరాకరించడం, రెండు కాళ్లు, రెండు చేతుల సహాయంతో జంతువుల మాదిరిగా నడవడం, కేవలం అరవడం సైగల ద్వారానే కమ్యూనికేట్ చేయడం వంటివి చేసేది. ఈ వింత ప్రవర్తన వల్లే మీడియా ఆమెకు ‘మౌగ్లీ గర్ల్’ అని పేరు పెట్టింది. మొదట చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆమెకు ‘పూజ’ అని పేరు పెట్టగా.. ఆ తర్వాత లక్నోలోని ‘నిర్వాన్ రాజ్కీయ బాల్ గృహ్’కు తరలించి అక్కడ ఆమె పేరును ‘ఎహ్‌సాస్’ (అంటే అనుభూతి) గా మార్చారు.
అడవి వాతావరణం నుంచి వచ్చిన ఎహ్‌సాస్‌ను మార్చడానికి నిర్వాన్ ఫౌండేషన్ చైర్మన్ సురేష్ సింగ్ ధపోలా, సిబ్బంది సంవత్సరాల తరబడి ఎంతో శ్రమించారు. నిరంతర వైద్య చికిత్స, ప్రేమ, కేరింగ్ వల్ల ఆమె మెల్లగా మనుషుల మధ్య జీవించడానికి అలవాటు పడింది. బట్టలు వేసుకోవడం, తనను చూసుకునే వారిని గుర్తుపట్టడం, వారి ప్రేమకు స్పందించడం నేర్చుకుంది. ముఖ్యంగా అక్కడి కేర్‌టేకర్ రాణిని ఆమె ఎంతో ప్రేమగా ‘అమ్మా’ అని కూడా పిలిచేది. జంతువుల మధ్య పెరిగిన ఒక బాలిక, మానవ అనురాగాన్ని గుర్తించి అమ్మా అని పిలవడం నిజంగా ఒక అద్భుతం.
ALSO READ : పెళ్లి కోసం వయస్సు తగ్గించి చెప్పిన భర్త..
అయితే ఆమె శారీరకంగా మారినప్పటికీ.. వైద్య పరీక్షల్లో ఆమె మెదడు మాత్రం వయస్సుతో పాటు పెరగలేదని, మానసిక వైకల్యం ఉన్నట్లు తేలింది. దీనికి తోడు ఆమెకు తరచూ ఫిట్స్ వచ్చేవి. ఇటీవల జూన్ 8న తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రిలో చేర్చి జూన్ 11న డిశ్చార్జ్ చేశారు. కానీ జూన్ 15న ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. దురదృష్టవశాత్తు.. ఆమె ఆసుపత్రికి చేరుకున్న కొద్దిసేపటికే మరణించింది. ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా రక్తంలో ఇన్ఫెక్షన్ వల్లే ఆమె చనిపోయిందని పోస్ట్‌మార్టం రిపోర్ట్ స్పష్టం చేసింది. అడవిలో అనాథగా దొరికిన ఒక బాలిక.. చివరికి కొందరి హృదయాల్లో చెరపలేని జ్ఞాపకంగా మారి లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.
