నీట్ రీ టెస్ట్‎కు NTA కొత్త గైడ్ లైన్స్.. పరీక్ష కేంద్రంలోకి ఏం తీసుకెళ్లాలి.. ఏం తీసుకెళ్లకూడదంటే..?

నీట్ రీ టెస్ట్‎కు NTA కొత్త గైడ్ లైన్స్.. పరీక్ష కేంద్రంలోకి ఏం తీసుకెళ్లాలి.. ఏం తీసుకెళ్లకూడదంటే..?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నీట్-2026 రీ టెస్ట్ ఆదివారం (జూన్ 21) జరగనుంది. ప్రశ్నా పత్రం లీకైందన్న ఆరోపణలతో 2026, మే 3న జరిగిన నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రద్దు చేసిన విషయం తెలిసిందే. పేపర్ లీక్ ఇష్యూ నేపథ్యంలో రీ ఎగ్జామ్‎ను ఎన్టీఏ పకడ్భందీగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే  పరీక్ష రాయబోయే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక సూచనలు చేసింది. 

పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు ఏం తీసుకెళ్లాలి.. ఏం తీసుకెళ్లకూడదనే గైడ్ లైన్స్ విడుదల చేసింది ఎన్టీఏ. ఈ నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ మతపరమైన నమ్మకాలకు సంబంధించిన గుర్తులైన కలవా (చేతికి కట్టే పవిత్ర దారం), హిజాబ్, తలపాగా (టర్బన్) ధరించి పరీక్షకు హాజరుకావచ్చు. మరోవైపు పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, భారీ ఆభరణాలను తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధించింది ఎన్టీఏ.

పరీక్ష కేంద్రంలోకి వీటికి అనుమతి

మతపరమైన దుస్తులు: హిజాబ్, తలపాగా (టర్బన్) వేసుకోవచ్చు. చేతికి కట్టుకునే కలవా లేదా పవిత్ర దారాలను కూడా అనుమతిస్తారు.

వాటర్ బాటిల్: లోపల ఉన్న నీళ్లు స్పష్టంగా కనిపించేలా ఉండే (ట్రాన్స్‌పారెంట్) వాటర్ బాటిల్స్ మాత్రమే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తారు

దుస్తులు, చెప్పులు: తేలికపాటి బట్టలు (లైట్ కలర్ దుస్తులు), సన్నటి పట్టీలు ఉన్న చెప్పులు లేదా తక్కువ హీల్స్ ఉన్న శాండల్స్ వేసుకోవడం మంచిది.

పరీక్ష కేంద్రంలోకి వీటిపై నిషేధం

ఎలక్ట్రానిక్ వస్తువులు: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ డివైజ్‌లు, ఇయర్‌ఫోన్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పరీక్ష కేంద్రంలోకి నిషేధం. 
నగలు, ఆభరణాలు: పెద్ద బెల్ట్ బకిల్స్, భారీ ఆభరణాలు, చెవి రింగులు, ముక్కు పుడకలు వంటి మెటల్ వస్తువులు పెట్టుకోకూడదు.
షూస్: అడుగు భాగంగా మందంగా (థిక్ సోల్) ఉన్న బూట్లు లేదా షూస్ వేసుకోకూడదు

పరీక్ష సమయం ఎప్పుడంటే..?

పరీక్ష ఆదివారం(జూన్ 21) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరుగుతుంది. పరీక్షా కేంద్రాలలో భద్రతా తనిఖీలు ఉదయం 11 గంటల నుండి ప్రారంభమవుతాయి. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం మధ్యాహ్నం 1:30 గంటలకు మూసివేయబడుతుంది. ఆ సమయం తర్వాత ఏ అభ్యర్థినీ లోపలికి అనుమతించరు. అందువల్ల విద్యార్థులు తమ కేంద్రాలకు చాలా ముందుగానే చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది.

ALSO READ : ప్రియుడితో ఉన్నప్పుడు లేచి ఏడుస్తున్నాడంట..

అభ్యర్థులు ఏ పత్రాలను వెంట తీసుకురావాలి..?

రీ-నీట్ 2026 అడ్మిట్ కార్డ్
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు
వర్తిస్తే PwD/PwBD సర్టిఫికేట్