క్రికెటర్‌కు కన్నీటి వీడ్కోలు.. అంతిమయాత్రలో బ్యాట్, బాల్‌తో నివాళులు

క్రికెటర్‌కు కన్నీటి వీడ్కోలు.. అంతిమయాత్రలో బ్యాట్, బాల్‌తో నివాళులు

Ahmedabad: క్రీడలపై ఒక వ్యక్తికి ఉండే ప్రేమ అతను చనిపోయిన తర్వాత కూడా ఎలా నిలిచిపోతుందో చూపించే ఒక అత్యంత హృదయవిదారకమైన సంఘటన అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. అనారోగ్యంతో అకాల మరణం చెందిన రోహిత్ అనే యువ స్థానిక క్రికెటర్‌కు కన్నీటి వీడ్కోలు పలికేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక మైదానాల్లో తన ఆటతీరుతో అందరి మనసులు గెలుచుకున్న రోహిత్ మరణం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

పాడెపై క్రికెట్ బ్యాట్, బాల్: 
క్రికెట్ అంటే రోహిత్‌కు ఉన్న పిచ్చిని, ఇష్టాన్ని గౌరవిస్తూ అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు భావోద్వేగభరితమైన నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ చివరి ప్రయాణంలో అతని పాడె (Bier) పక్కనే ఒక క్రికెట్ బ్యాట్, బాల్ ఉంచి అంతిమ యాత్ర నిర్వహించారు. తన జీవితంలో  భాగమైన ఆటను, అతని చివరి ప్రయాణంలోనూ తోడుగా పంపడం చూసి అక్కడ చేరిన వారందరి కళ్లు చెమర్చాయి.

గల్లీ క్రికెట్ స్టార్ బౌలర్: 
రోహిత్ కేవలం ఆటగాడే కాదు, లోకల్ క్రికెట్ గ్రౌండ్స్‌లో మంచి గుర్తింపు ఉన్న టాలెంటెడ్ బౌలర్ అని అతని స్నేహితులు గుర్తు చేసుకున్నారు. మైదానంలో అతను వేసే బౌలింగ్‌కు లోకల్ టీమ్స్ లో మంచి రెస్పెక్ట్ ఉండేది.. ఆటతో పాటు అతని స్నేహపూర్వక స్వభావం, ఎప్పుడూ నవ్వుతూ పలకరించే మనస్తత్వం వల్ల ఆ ఏరియాలో అందరికీ రోహిత్ అంటే చాలా ఇష్టం.. అలాంటి ఒక మంచి కుర్రాడు ఇంత చిన్న వయసులోనే దూరమవ్వడం స్నేహితులకు, స్థానికులకు తీవ్రంగా కలిచివేసింది. 

అంతిమ యాత్ర కొనసాగుతున్నంత సేపూ గల్లీల్లోని ప్రజలు రోహిత్‌ను చూస్తూ కన్నీరు మున్నీరయ్యారు. ఒక క్రీడ అనేది మనిషి గుర్తింపుగా ఎలా మారుతుందో చెప్పడానికి రోహిత్ అంతిమ యాత్రే ఒక నిదర్శనంగా నిలిచింది. చివరి శ్వాస వరకు తను ప్రేమించిన క్రికెట్‌తోనే రోహిత్ ప్రయాణం ముగిసింది.