మిస్టరీని తేల్చలేక చేతులెత్తేశారు

మిస్టరీని తేల్చలేక చేతులెత్తేశారు

ఒక పారానార్మల్ యాక్టివిటీ అనుకోకుండా కెమెరాలో క్యాప్చర్ అయిన వీడియోలు, ఫొటోలను చాలా మంది చూసే ఉంటారు. అలాంటివి ఎప్పుడూ వైరల్‌‌ అవుతూనే ఉంటాయి. కానీ.. వాటిలో ఎంతవరకు నిజముంది? అనేది చాలామందికి తెలియదు. వాటిలో కంప్యూటర్‌‌‌‌ గ్రాఫిక్స్‌‌ చేసినవే ఎక్కువ. ఇక్కడ మాత్రం ఈ ఫొటో నిజమని నమ్మించేందుకు చాలా ఆధారాలు ఉన్నాయి. కానీ.. ఆ ఫొటోలో ఉన్నది ఎవరనేది తెలుసుకోవడానికి ఒక్క ఆధారమూ దొరకలేదు. అందుకే అందులో ఉన్నది దెయ్యమా? మనిషా? అనేది తెలియక తలలు పట్టుకుంటున్నారు.  

ఒకటి.. రెండు కాదు దాదాపు 20 ఫొటోల్లో ఒక అమ్మాయి కోపంగా కనిపించింది. ఈ విచిత్రమైన సంఘటన 20వ శతాబ్దం మొదట్లో జరిగింది. ఈ ఫొటోల రహస్యాన్ని కనిపెట్టడానికి పనిచేసిన ఎక్స్‌‌పర్ట్స్‌‌ కూడా మిస్టరీని తేల్చలేక చేతులెత్తేశారు. ఇంతకీ విషయం ఏంటంటే.. రష్యాలోని వివిధ ప్రాంతాల్లో తీసిన కొన్ని బిల్డింగ్స్‌‌ ఫొటోల్లో ఒక అమ్మాయి, ఒకే పోశ్చర్‌‌‌‌లో నిల్చొని ఉంది. అవన్నీ వేరు వేరు ప్రాంతాల్లో.. వేరు వేరు సమయాల్లో.. వేరు వేరు ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలు. 

దాదాపు 110 సంవత్సరాల క్రితం ఫొటో తీయడం అనేది ఒక ట్రెండ్‌‌గా మారింది. అప్పట్లో రష్యాలోని సంపన్నుల ఆనందం కోసం ఫొటోగ్రాఫర్లు వాళ్ల ఫొటోలు తీసేవాళ్లు. దాంతో రష్యన్ సామ్రాజ్యంలో ఫొటోగ్రఫీకి విపరీతంగా క్రేజ్ పెరిగింది. అప్పటి ఫొటోగ్రాఫర్లు నగరాల్లోని ప్రసిద్ధ భవనాలు, పర్యాటక ప్రదేశాల ఫొటోలు తీసి పోస్ట్‌‌కార్డులు, పోస్టర్లలో వాడడం కోసం అమ్ముకునేవాళ్లు. చాలారోజుల పాటు ఫొటోలు అమ్మడం ద్వారా ఫొటోగ్రాఫర్లు డబ్బు సంపాదించుకున్నారు. మార్కెట్‌‌లో ఫొటోలను వస్తువుల్లాగా అమ్మడం, కొనడం చేసే పరిస్థితి ఏర్పడింది. దాంతో చాలా ఫొటోలు మార్కెట్‌‌లోకి వచ్చాయి. అయితే.. అలాంటి ఫొటోలను కొన్నేండ్ల క్రితం క్రాస్నోయార్స్క్‌‌లోని మ్యూజియం అధికారులు డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు.  అందుకోసం కొందరు రీసెర్చర్లతో ఒక టీంని నియమించారు. ఫొటోలు ఒరిజినల్‌‌వా కాదా? ఏ సంవత్సరంలో? ఎవరు తీశారు?.. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ఆ రీసెర్చర్ల పని. వాళ్లకు అందిన కొన్ని ఫొటోల్లో ఒక విచిత్రమైన విషయాన్ని తెలుసుకున్నారు రీసెర్చర్లు. అదేంటంటే.. రష్యాలోని వివిధ ప్రాంతాల్లోని చారిత్రాత్మక ప్రదేశాల్లో తీసిన సుమారు 20 ఫొటోల్లో అస్పష్టంగా ఒక అమ్మాయి బొమ్మ రీసెర్చర్లకు కనిపించింది. 

విపరీతమైన కోపం

రీసెర్చర్లకు కనిపించిన ఆమె ముఖం చాలా కోపంగా ఉంది. ఒక ప్రత్యేకమైన ట్రేడ్‌‌మార్క్ బోటర్ తరహా టోపీ పెట్టుకుంది. రెండు చేతుల్లో గొడుగు పట్టుకుంది. ముదురు రంగు బట్టలు వేసుకుని ఉంది. వయసు 8 నుంచి 10 ఏండ్ల మధ్య ఉంటుంది. అయితే.. ఆ ఫొటోల్లో ఉన్న అమ్మాయి ఎవరు? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. ఈ అమ్మాయి ఉన్న ఫొటోలను మాత్రం రష్యాలో ‘‘ఫాంటమ్‌‌ గర్ల్‌‌” ఫొటోలు అని పిలుస్తుంటారు. డ్రెస్సింగ్ స్టైల్‌‌ ఆధారంగా ఆ అమ్మాయి సంపన్న కుటుంబానికి చెందినదని అనుకున్నారు. కానీ.. ఆ అమ్మాయి ఎవరనే విషయాన్ని చెప్పేందుకు సంపన్నుల కుటుంబాల్లో నుంచి ఒక్క వ్యక్తి కూడా ఇప్పటివరకు ముందుకు రాలేదు. ఇంకా పెద్ద ప్రశ్న ఏమిటంటే.. వివిధ ప్రదేశాల్లో వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు సమయాల్లో ఒకే అమ్మాయిని ఒకే రకమైన బట్టల్లో ఎలా ఫొటో తీశారు? ప్రతి  ఫొటోగ్రాఫ్‌‌లో ఈ అమ్మాయి ఒకే పోశ్చర్‌‌‌‌లో ఎందుకు నిలబడింది? ఇన్నేండ్లుగా ఆ అమ్మాయిని ఎవరూ, ఎందుకు గుర్తించలేదు? అనే ప్రశ్నలకు సమాధానం కునుక్కోవడానికి రీసెర్చర్లు మరింత లోతుగా రీసెర్చ్‌‌ చేశారు. ఆ ఫొటోల నెగెటివ్స్‌‌ తెప్పించి చూశారు. కానీ.. వాటిలోని కొన్ని నెగిటివ్‌‌ల్లో అమ్మాయి బొమ్మ సరిగా కనిపించలేదు. 

ఎవరు తీశారో తెలియదు

ఈ అమ్మాయి ఫొటోలను ఎవరు తీశారు అనే సమాచారం ఇప్పటికీ దొరకలేదు. వాస్తవానికి అప్పట్లో ఫొటోగ్రాఫర్లు వాళ్లు తీసిన అన్ని ఫొటోలపై పేరు లేదా పేరులోని కొన్ని అక్షరాలను రాసుకునేవాళ్లు. ఈ ఫొటోలపై ఫొటోగ్రాఫర్‌‌‌‌ పేరు కనిపించలేదు. కొన్నింటిపై మాత్రం ‘‘ఎఫ్‌‌ఈఏ’’ అని రాసి ఉంది. ఆ అక్షరాలు రాసుకునే ఫొటోగ్రాఫర్ అప్పట్లో ఎవరూ లేరు. ఒక్క ఫొటోగ్రాఫర్‌‌‌‌ పేరుతోనూ ఆ అక్షరాలు సరిపోలేదు. దాంతో ఆ ఫొటోలను ఎవరు తీశారనేది ఇప్పటికీ తెలియదు. కానీ చాలా ఫొటోల్లో అమ్మాయి బొమ్మ స్పష్టంగా లేదు. ఈ ఫొటోలను జాగ్రత్తగా పరిశీలిస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. కొన్ని ఫొటోల్లో కనిపిస్తున్న వ్యక్తుల ఎక్స్‌‌ప్రెషన్స్‌‌ని బట్టి చూస్తే.. ఆ టైంలో అక్కడ అమ్మాయి ఉందన్న విషయం వాళ్లు కూడా గుర్తించలేదు. ప్రతి ఫొటోలో కెమెరా వైపు చూస్తూ, భయపెట్టేలా ఉంది. అయితే.. ఈ ఫొటోల గురించి విభిన్న సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. కానీ.. ఏ సిద్ధాంతమూ ఆమె ఎవరనేది స్పష్టంగా చెప్పలేకపోయింది. ఎవరూ ఈ రహస్యాన్ని పూర్తిగా పరిష్కరించలేకపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోలు రష్యాలోని క్రాస్నోయార్స్క్ లోకల్‌‌ మ్యూజియంలో ఉన్నాయి. 

ది సైబీరియన్ టైమ్స్

ఈ అమ్మాయి ఎవరనేది గుర్తించేందుకు ‘‘ది సైబీరియన్ టైమ్స్” అనే సంస్థ కొన్ని యాడ్స్ కూడా ఇచ్చింది. అయినా.. ఈ రోజు వరకు ఆ అమ్మాయి గురించి, ఆ ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ గురించి తెలుసుకోలేకపోయింది. కాకపోతే ఈ ఫొటోలు 1916 –1919 మధ్య తీసినవని గుర్తించింది. కానీ.. ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు అలా  కోపంగా ఉంది? ఫొటోలను వైరల్‌‌ చేయడానికి ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రా? ఆమె చారిత్రాత్మక కట్టడాల్లో ఉన్న ఆత్మా?... ఇలాంటి ప్రశ్నలకు సమధానం చెప్పలేకపోయింది.  

ధనిక కుటుంబం

ఒక సిద్ధాంతం ప్రకారం.. ఆమె స్థానిక ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎందుకంటే.. ఆమె ఎప్పుడూ మంచి బట్టలు వేసుకుని ఉంది. పొడవాటి జడ వేసుకుని, లేత -రంగు క్యాప్‌‌ పెట్టుకుని ఉంది. క్యాప్‌‌ చివర ముదురు రిబ్బన్లు కట్టి ఉన్నాయి. ధనవంతులే ఇలా ఉండేవాళ్లు. అప్పట్లో కమ్యూనిస్ట్‌‌ల ఒత్తిళ్ల వల్ల వాళ్ల కుటుంబం రష్యా నుంచి పారిపోయి ఉండొచ్చు. అందుకే.. ఆమె జాడ గురించి రష్యాలో వెతికితే దొరకలేదు. ఆమె యూరప్‌‌ దేశాల్లోనో.. లేదా అమెరికాలోనో సెటిల్‌‌ అయి ఉండొచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం.. ఆమె వేరే దేశాలకు వెళ్లినా ఆమెను గుర్తుపట్టేవాళ్లు కొందరైనా రష్యాలో ఉంటారనేది మరికొందరి వాదన. 

ఒకే డ్రెస్‌‌.. 

ఆ ఫొటోలన్నీ ఒకే రోజు ఒకే ఫొటోగ్రాఫర్‌‌‌‌ తీసినవని కొందరు వాదించారు. ఆ వాదనకు కారణం ఆమె బట్టలు. ఒకే డ్రెస్‌‌లో ఆ ఫొటోలు దిగిందని నమ్మారు. కానీ.. ఆ ఫొటోల్లో ఉన్నది ఒకే డ్రస్‌‌ కాదు.. ఒకేలా కనిపించే డ్రెస్‌‌లు. ఫొటోలను బాగా జూమ్‌‌ చేసి పరిశీలిస్తే.. డ్రెస్‌‌ల్లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. పైగా ఫొటోల్లో వేరు వేరు రంగుల బూట్లు వేసుకుంది. దాంతో అవి ఒకే రోజులో తీసినవి కావని మరికొందరు అంటున్నారు. పైగా ఆ ఫొటోలను పరిశీలించిన ఎక్స్‌‌పర్ట్స్‌‌.. అవి వేరు వేరు సంవత్సరాల్లో తీశారని చెప్తున్నారు. 

వయసు పెరగలేదా? 

ఈ ఫొటోలు 1916 –1919  మధ్య తీసినవని చాలామంది అంటున్నారు. కానీ..  అది అవాస్తవమని మరికొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే.. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి వయసు దాదాపు పదేండ్లు ఉంటుంది. కానీ.. ఆ వయసులో ఉన్న ఆడపిల్లల్లో చాలా మార్పులు వస్తాయి. చాలా స్పీడ్‌‌గా ఎత్తు పెరుగుతారు. కానీ.. ఈ ఫొటోల్లో ఉన్న అమ్మాయిలో చిన్న మార్పు కూడా లేదు. కాబట్టి అవన్నీ ఒకేసారి తీసినవని కొందరు అంటున్నారు. 

ఫొటోగ్రాఫర్‌‌‌‌ కూతురు

ఆ అమ్మాయి ఒక ఫేమస్‌‌ ఫొటోగ్రాఫర్ కూతురు కావచ్చని చాలామంది అనుకున్నారు. ఆ ఫొటోగ్రాఫర్‌‌‌‌ తన కూతురు అందరిలో స్పెషల్‌‌గా ఉండాలనే ఉద్దేశంతో ఇలా ఒక పోశ్చర్‌‌‌‌లో ఉండేట్టు ఫొటోలు తీసి ఉండొచ్చని కొందరు నమ్ముతున్నారు. కానీ.. మరికొందరేమో నిజంగా ఆ అమ్మాయి ఫొటోగ్రాఫర్ కూతురే అయితే.. అసలు ఆ అమ్మాయి ఫొటోలో ఉందో లేదో అన్నట్టుగా ఎందుకు తీస్తాడు. ఆ అమ్మాయి బాగా కనిపించేలా తీసేవాడు కదా అంటున్నారు. ఎందుకంటే.. కొన్ని ఫొటోల్లో ఆమె అస్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. అప్పట్లో ఫొటో తీయడం చాలా కష్టమైన పని. ఒక్క ఫొటో తీయడానికి నాలుగైదు నిమిషాలు పట్టేది. పైగా పెద్దగా టెక్నాలజీ కూడా లేదు. అందుకే ఆయన క్లోజప్‌‌ షాట్స్‌‌ తీయలేకపోయాడని మరికొందరి వాదన. 

పోస్ట్‌‌కార్డ్‌‌ల కోసం

ఒక ప్రైవేట్‌‌ ఆల్బమ్‌‌ కోసం ఫొటోగ్రాఫర్‌‌‌‌ ఈ ఫొటోలు తీశాడని చాలామంది నమ్మారు. కానీ.. కొందరు మాత్రం ఆ ఫొటోలు పోస్ట్‌‌కార్డుల కోసమే ప్రత్యేకంగా తీశారని నమ్ముతున్నారు. ఎందుకంటే.. ఫొటోలో మనిషి పెద్దగా కనిపించి వెనకున్న కట్టడం సరిగా కనిపించకపోతే అలాంటి ఫొటోలను పోస్ట్‌‌కార్ట్‌‌ల కోసం వాడేవాళ్లు కాదు. అందుకే ఆ అమ్మాయి చిన్నగా కనిపించేలా ఫొటోలు తీశారు. ఫొటోను చాలా జూమ్‌‌ చేసి చూస్తేనే ఆ అమ్మాయి కనిపిస్తుంది. అందువల్ల ఆ ఫొటోలను పోస్ట్‌‌కార్డులకు వాడితే ఎన్నేండ్లు గడిచినా, చివరికి ఆ అమ్మాయి చనిపోయానా పోస్ట్‌‌ కార్డుల్లో ఆ అమ్మాయి ఫొటో ఉంటుందనే ఉద్దేశంతోనే ఇలా ఫొటోలు తీసి ఉంటాడని మరికొందరు అన్నారు. 

దెయ్యమా? 

ఆమె ఏ ఒక్క ఫొటోలో కూడా నవ్వినట్టు లేదు. ప్రతి ఫొటోలో కోపంగా ఒకే ఎక్స్‌‌ప్రెషన్‌‌ ఉంది. పైగా ఫొటో గ్రాఫర్‌‌‌‌ని కోపంగా చూస్తున్నట్టు ఉంది. దాంతో ఆ ఫొటోలో ఉంది మనిషి కాదు.. దెయ్యమని చాలామంది నమ్మారు. ఆ ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్‌‌‌‌ని వెంటాడుతోందని అందుకే అతను తీసిన ప్రతి ఫొటోలో కనిపిస్తూ అతన్ని కోపంగా చూస్తుందని నమ్మారు. కానీ.. అది కూడా వాస్తవం కాదని తేలింది. ఎందుకంటే.. కొన్ని ఫొటోల్లో ఆమెను చుట్టు పక్కల వాళ్లు చూస్తున్నారు. అంటే.. ఆమె అందరికీ కనిపిస్తుంది. కాబట్టి అందులో ఉన్నది దెయ్యం కాదని చెప్తున్నారు. అంతేకాకుండా ఒక ఫొటోలో మరికొందరు పిల్లలతో కలిసి ఉంది. పైగా కొన్ని ఫొటోల్లో వేరే బట్టలు వేసుకుంది. దాంతో ‘‘ఎక్కడైనా దెయ్యాలు బట్టలు మార్చుకుంటాయా?” అని సెటైర్లు వేసినవాళ్లు కూడా ఉన్నారు.

::: కరుణాకర్​ మానెగాళ్ల