ఎయిర్​ఫోర్స్​కు  సీ 295 విమానాలు

ఎయిర్​ఫోర్స్​కు  సీ 295 విమానాలు

న్యూఢిల్లీ, వెలుగు: రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. పాతబడిపోయిన ఎయిర్​ఫోర్స్​ ట్రాన్స్​పోర్ట్​ విమానాలు ‘అవ్రో 748’ల స్థానంలో కొత్త విమానాలను తీసుకోనుంది. 56 ‘సీ 295 ఎండబ్ల్యూ’ మీడియం ఎయిర్​క్రాఫ్ట్​లను కొనేందుకు స్పెయిన్​కు చెందిన ఎయిర్​ బస్​ డిఫెన్స్​ అండ్​ స్పేస్​తో రూ.20 వేల కోట్ల ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఆ విమానాలను సంస్థలు మన దేశంలోనే తయారు చేయనున్నాయి. యుద్ధ విమానాలకు సంబంధించి తొలి మేకిన్​ ఇండియా ప్రాజెక్ట్​ ఇదేనని అధికారులు చెప్తున్నారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే నాటి నుంచి నాలుగేండ్లలో పూర్తిగా తయారు చేసిన 16 విమానాలను ఆయా సంస్థలు మన దేశానికి అందిస్తాయి. మిగతా 40 విమానాలను ఎయిర్​బస్​ డిఫెన్స్​ అండ్​ స్పేస్​, టాటా అడ్వాన్స్ డ్​ సిస్టమ్స్​ లిమిటెడ్​ (టీఏఎస్​ఎల్​)ల కన్సార్టియం తయారు చేస్తాయి. పదేండ్లలో ఆ విమానాలను సైన్యానికి అందజేస్తాయి. విమానాల కొనుగోలుతో పాటే హ్యాంగర్లు, అప్రాన్సలు, టాక్సీ వేల రూపంలో ప్రత్యేక మౌలిక వసతులనూ ఒప్పందంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. 

విమానాల్లో లోకల్​ పరికరాలే

ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసే విమానాల్లో మన దేశంలో సొంతంగా తయారుచేసుకున్న ఎలక్ట్రానిక్​ వార్​ఫేర్​ సూట్​లనే వాడనున్నారు. ఈ విమానాలు 5 నుంచి 10 టన్నుల కెపాసిటీని కలిగి ఉంటాయి.ఈ విమానాలను నార్తర్న్​, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్​ నికోబార్​ దీవుల్లో మన ఎయిర్​ఫోర్స్​ కెపాసిటీని పెంచేందుకు ఇది దోహదపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎయిర్​బస్​ డిఫెన్స్​, టీఏఎస్​ఎల్​, దేశ రక్షణ శాఖ మధ్య జరిగిన ఈ ఒప్పందం ఓ గొప్ప ముందడుగు అని టాటా ట్రస్ట్స్​ చైర్మన్​ రతన్​ టాటా అన్నారు.