క్రిమినల్స్ చెందిన రూ.32.34 కోట్లు జప్తు

క్రిమినల్స్  చెందిన  రూ.32.34 కోట్లు జప్తు
  • దేశవ్యాప్తంగా 15 రోజుల్లో  రూ.524 కోట్లు దోపిడీ
  • సైబర్ నేరగాళ్ల చేతిలో 580 ఫేక్ అకౌంట్స్
  • సిటీ సైబర్ క్రైమ్‌‌ కేసును దర్యాప్తు చేస్తోన్న ఈడీ 

హైదరాబాద్‌‌,వెలుగు: పార్ట్‌‌ టైమ్ జాబ్ ల పేరుతో దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ)దర్యాప్తు ముమ్మరం చేసింది.హైదరాబాద్‌‌ సైబర్‌‌ క్రైం పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా సైబర్ నేరగాళ్లకు చెందిన 580 బ్యాంకు ఖాతాల్లోని రూ.32.34 కోట్లను జప్తు చేసింది. ఈడీ అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్క్‌‌ఫ్రమ్‌‌ హోమ్‌‌, పార్ట్‌‌టైమ్‌‌ జాబ్స్‌‌ పేరుతో వెబ్‌‌సైట్లు, హోటళ్లు, రిసార్ట్‌‌లకు రేటింగ్‌‌, రివ్యూలు ఇస్తే మీ ఖాతాల్లో డబ్బులు వేస్తామని సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేసేవారు. రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 సంపాదించవచ్చని వాట్సప్‌‌, టెలీగ్రామ్‌‌ యాప్‌‌ల ద్వారా మెసేజ్‌‌లు పంపేవారు.  బాధితుల చేత బోగస్‌‌ ఈ వ్యాలెట్లు,నకిలీ యాప్‌‌లు డౌన్‌‌లోడ్‌‌ చేయించేవారు. వారికి లాభాలు ఇస్తామంటూ వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించేవారు.

ఫ్రీజ్ అయిన డబ్బు తిరిగిపొందాలంటే..

ఈ -వ్యాలెట్‌‌లోని డబ్బు ఫ్రీజ్‌‌ అయిందని, తిరిగి పొందాలంటే ముందుగా కొంత డబ్బు మేం చెప్పే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నమ్మించేవారు. ఇలా 15 రోజుల్లోనే  దేశవ్యాప్తంగా 175 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.524 కోట్లు కొల్లగొట్టినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదంతా..  యూఏఈ  కేంద్రంగా చేసినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. అమాయక ప్రజల నుంచి సేకరించిన డబ్బులు, ఫేక్‌‌ డాక్యుమెంట్లను ఉపయోగించి తెరిచిన పలు బ్యాంకు ఖాతాల్లోకి మార్చినట్టు వెల్లడైంది.  ఇలాంటి మోసాలపై దేశవ్యాప్తంగా పలు పోలీస్‌‌స్టేషన్లలో 50 ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదైనట్టు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం రూ.32.34 కోట్లు జప్తు చేశామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు వివరించారు.